ఆయుధ కొనుగోళ్లలో స్వావలంబనకు పెద్దపీట

ఆయుధ కొనుగోళ్లలో స్వావలంబనకు పెద్దపీట
జాతీయ భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయుధ కొనుగోళ్లలో స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సంస్థల నుంచి రూ.1.20లక్షల కోట్లు విలువ చేసే ఆయుధాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. వికసిత్ భారత్​ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన మూడు ప్రధాన లక్ష్యాల ప్రాధాన్యత గురించి వివరించారు. 

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్​నాథ్​ సింగ్​ కీలకమైన రక్షణ సామర్థ్యాల్లో స్వావలంబన సాధించాలని పేర్కొన్నారు. యుద్ధరంగంలో మారుతున్న పరిస్థితుల పట్ల ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని స్పష్టం చేశారు. 2029 నాటికి రూ 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులు సాధించాలని, రూ 50 వేల కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

“భారత్ ఇప్పటికే ఆధునిక సాంకేతిక రంగాలలో ముందంజలో ఉంది. కానీ దేశాన్ని అగ్రగామిగా మార్చడానికి కొత్త, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాల్లో మరింత అభివృద్ధి సాధించాలి. 2047 నాటికి వికసిత్ భారత్​ మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు మూడు ప్రధాన అంశాలను గుర్తుంచుకోవాలి. మొదటిగా కీలక రక్షణ సామర్థ్యాలలో ఉన్నత స్థాయి స్వావలంబన సాధించాలి” అని తెలిపారు.

“రెండవది, రక్షణ రంగంలో ప్రపంచ ఎగుమతిదారుగా మారాలి. మూడవది, ఆధునిక సాంకేతిక రంగాలలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు, కొత్త, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాల్లో పురోగతి సాధించాలి. ఈ మూడు లక్ష్యాలను చేరుకోగలిగితే, భారత్‌ను 2047 నాటికి వికసిత దేశంగా మాత్రమే కాకుండా, రక్షణ ఆవిష్కరణలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చవచ్చు’ అని రాజ్​నాథ్ సింగ్ వివరించారు.

ఆధునిక యుద్ధాలు సాంకేతికత ఆధారంగా మారిపోయాయని మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఈ మార్పును స్పష్టంగా చూశామని చెప్పారు. డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలు వంటి నాన్-కాంటాక్ట్ వార్‌ఫేర్ ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఫలితంగా సవాళ్లు, బాధ్యతలు రెండు కూడా పెరిగాయని చెప్పారు. 

 
మనం ప్రస్తుత అత్యాధునిక సాంకేతికతలు ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి వాటిని నేర్చుకోవాలని పేర్కొంటూ వాటినే కాకుండా ప్రపంచంలో ఇంకా ఆవిష్కరించని భవిష్యత్ సాంకేతికతలపైనా కూడా దృష్టి పెట్టాలని రాజనాథ్ సింగ్ తెలిపారు.  2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సంస్థల నుంచి రూ.1.20లక్షల కోట్లు విలువ చేసే ఆయుధాలు కొనుగోలు చేసినట్లు రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు.
 
“2021-22లో దేశీయంగా ఆయుధాల కొనుగోళ్లు దాదాపు రూ.74వేల కోట్లు ఉండేవి. కానీ 2024-25లో దేశీయంగా ఆయుధాల కొనుగోళ్లు రూ.1.20లక్షల కోట్లకు చేరాయి. ఈ మార్పు కేవలం డేటా మాత్రమే కాదు ప్రభుత్వ ఆలోచన విధానం కూడా. ఏటా రక్షణ శాఖ చేసే ఆయుధ కొనుగోళ్లలో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుంచి సేకరించాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం” అని వెల్లడించారు. 
 
“ప్రస్తుతం  350కి పైగా రక్షణ పరికరాలను సూక్ష్మ, చిన్న సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం. విధానపరమైన సంస్కరణల ద్వారా రక్షణ శాఖ ఆయుధ సరఫరా చైన్‌లో అన్నిసంస్థలను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం” అని రాజ్​నాథ్ సింగ్ వివరించారు.