 
                * ఐరాసలో పాక్ అధికారణి వ్యాఖ్యలను ఖండించిన భారత్ 
ఐరాసలో విషం చిమ్మేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భారత్ చేతిలో మరోసారి భంగపాటు ఎదురైంది. భద్రతామండలిలో మహిళలు, శాంతిభద్రతలపై జరిగిన బహిరంగ చర్చలో పాల్గొన్న పాక్ అధికారిణి సౌమా సలీం, కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్నారని ఆరోపించారు. వారు లైంగిక హింసకు గురవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. 
ఆమె వ్యాఖ్యలను ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా ఖండించారు. 
ప్రతిసారి భారత్‌పై నిందలు మోపేందుకు దాయాది దేశం ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలు, శాంతిభద్రతల అజెండాలకు సంబంధించి తమ మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.  కానీ, పాకిస్థానే సొంత ప్రజలపై బాంబులు వేసి మారణహోమానికి పాల్పడుతోందని హరీష్ ఆరోపించారు. అలాంటి దేశం ప్రపంచదృష్టిని మరల్చేందుకు భారత్‌పై నిందలు వేయటం విడ్డూరంగా ఉందని చురకలు వేశారు. 
పాక్ తప్పుడు వాదనలను ప్రపంచమంతా చూస్తోందని భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ గుర్తుచేశారు.  పాకిస్తాన్ “క్రమబద్ధమైన మారణహోమం” నిర్వహిస్తోందని, “ప్రపంచాన్ని తప్పుదారి పట్టించడానికి, అతిశయోక్తితో” మాత్రమే దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుందని హరీష్ మండిపడ్డారు. “ప్రతి సంవత్సరం, దురదృష్టవశాత్తు, మా దేశంపై, ముఖ్యంగా వారు కోరుకునే భారత భూభాగం జమ్మూ,కాశ్మీర్‌పై పాకిస్తాన్ చేసే భ్రాంతికరమైన విమర్శలను వినడం మన విధి” అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. 
ఇస్లామాబాద్ మహిళల హక్కులను ఉల్లంఘించినందుకు తీవ్రంగా విమర్శిస్తూ  “ప్రపంచాన్ని అతిశయోక్తితో తప్పుదారి పట్టిస్తున్నారని” ఆరోపించారు. పాకిస్తాన్ చేసిన చారిత్రక దురాగతాలను ఆయన గుర్తుచేసుకుంటూ, “ఇది 1971లో ఆపరేషన్ సెర్చ్‌లైట్ నిర్వహించి, తన సొంత సైన్యం ద్వారా 400,000 మంది మహిళా పౌరులపై జాతి విధ్వంసక సామూహిక అత్యాచారానికి క్రమబద్ధమైన ప్రచారాన్ని అనుమతించిన దేశం. ప్రపంచం పాకిస్తాన్ ప్రచారాన్ని చూస్తుంది” అని ఎద్దేవా చేశారు. 
జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా” ఉందని,  ఎప్పటికీ” ఉంటుందని భారతదేశం పాకిస్తాన్‌కు పదేపదే స్పష్టం చేస్తూ వస్తున్నది. “ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవ హక్కుల రికార్డులు” కలిగిన దేశం పాకిస్తాన్ అని పేర్కొంటూ, తన సమాజంలోని మతపరమైన మైనారిటీలపై “విపరీతమైన” ప్రాయోజిత హింస, “వ్యవస్థాగత వివక్ష”ను ప్రదర్శిస్తున్నదని గతవారం భారత్  పాకిస్తాన్‌ను విమర్శించింది.
                            
                        
	                    




More Stories
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు