‘మీపై దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది’

‘మీపై దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది’

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై షూ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. భారత సీజేఐపై దాడికి యత్నించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సీజేఐతో మాట్లాడారు. అనంతరం మన సమాజంలో ఇలాంటి అనైతికమైన చర్యలకు తావు లేదని స్పష్టం చేస్తూ ప్రధాని ఎక్స్ పోస్ట్ పెట్టారు.

“భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌తో మాట్లాడాను. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. ఇలాంటి అనైతికమైన.. ఆమోదయోగ్యంకాని చర్యలకు మన సమాజంలో చోటు లేదు. సీజేఐపై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని మోదీ తన ట్వీట్‌లో వెల్లడించారు.

సుప్రీంకోర్టు ఆవరణలో సోమవారం ఉదయం ఒక కేసు విచారణ సమయలో 72 ఏళ్ల లాయర్ రాకేశ్ కిశోర్ సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించారు. ఆయనను గమనించిన తోటి లాయర్లు అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది ఆయనను బయటకు తీసుకెళ్తుండగా సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని భారత్ సహించదు అని గట్టిగా అరిచారు. అయితే.. తనపై దాడి ప్రయత్నం జరిగినా అదేమీ పట్టదన్నట్టుగా తన పనిలో తాను నిమగ్నమయ్యారు సీజేఐ.

కాగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్‌పై బూటుతో దాడికి ప్రయత్నించిన కిషోర్ రాకేశ్‌ను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. తక్షణం ఆయన లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో ఏ కోర్టులో కానీ, ట్రిబ్యునల్, లేదా లీగల్ అథారిటీలో కానీ తదుపరి క్రమశిక్షణ చర్య వరకు విధులు నిర్వహించరాదని ఆదేశించింది.
 
ఈమేరకు ఆ న్యాయవాదికి సస్పెన్షన్ ఎందుకు కొనసాగించకూడదో, తదుపరి చర్య ఎందుకు తీసుకోకూడదో 15 రోజుల్లోగా స్పందించి సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్ జారీ చేయనుంది. ఎటువంటి ఆలస్యం కాకుండా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కావాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ ఆదేశించింది. అధికారిక జాబితాలోను ఆ న్యాయవాది ప్రస్తుత హోదా తెలియజేయడమే కాక, దేశంలోని అన్ని కోర్టులకు , ట్రిబ్యునళ్లకు ఈ సస్పెన్షన్ సమాచారం అందించాలని ఆదేశించింది.