మావోయిస్టుల్లో మల్లోజుల రాజీనామా ముసలం

మావోయిస్టుల్లో మల్లోజుల రాజీనామా ముసలం
 
* విప్లవోద్యమ నాయకత్వానికి నేను అనర్హుడినని ప్రకటన
 
మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు రేగాయి. ఆ పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని క్యాడర్‌కు పిలుపునిస్తూ ఆయన రాసిన 22 పేజీల లేఖ సోమవారం విడుదల చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఈ పదవిలో కొనసాగే అర్హత తనకు లేదని భావించి పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు
 
“ఆయుధాలు వదిలేస్తాం” అంటూ కొద్దిరోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. “నిన్నటి పొరపాట్లను విశ్లేషించుకోవడం ద్వారా నేడు, రేపు వాటిని నివారించడం ఎలాగో మనం నేర్చుకుంటాం. తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకోవడం రోగం రాకుండా టీకా తీసుకోవడం వంటిది. విప్లవోద్యమాన్ని కూడా అదే తీరుగా నడిపించగలుగుతాం” అని స్పష్టం చేశారు. 
 
“ఇది నల్లేరు మీద బండిలా సాగే పని ఎంతమాత్రం కాదు. తీవ్రమైన అధ్యయనం, ఓపికతో, త్యాగాలతో కూడిన విప్లవాచరణ” అని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఉన్నదని, ఆయుధ పోరాటాలను తాతాలికంగా విరమించాలని ఆ లేఖలో కోరారు. దశాబ్దాల తరబడి తప్పుడు విధానాలే తీవ్రమైన నష్టాలకు కారణమని, ‘సైన్యం తప్ప రహస్య పార్టీ లేదు’ అని ఆయన ఖరాకండిగా ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమించి, ప్రజల మధ్యకు బహిరంగంగా వెళ్లాలని ఆయన క్యాడర్‌ను కోరారు. పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిన మౌలికమైన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి సైన్యంతో ఉంటే సాధ్యం కాదని వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ‘విప్లవపార్టీ లేకుండా విప్లవమే లేదు’ అనే లెనిన్‌ సూత్రాన్ని విస్మరించడం వల్ల, మావోయిస్టులకు సైన్యం తప్ప రహస్య పార్టీ లేని స్థితి ఏర్పడిందని విమర్శించారు. 
 
ప్రస్తుతమున్న ఏసీ, డీవీసీ వంటి పార్టీ కమిటీలన్నీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వెంట, సైనిక దుస్తులలో సాయుధులుగా ఉండటం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. వీటిని శత్రువుకు అబేధ్యమైన రహస్య పార్టీ నిర్మాణాలుగా పరిగణించలేమని, ఇదే బలహీనత శత్రువుకు పార్టీని నిర్మూలించేందుకు పూర్తి అవకాశాన్ని ఇచ్చిందని తెలిపారు. 2007లో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లో దండకారణ్యం (డీకే), బీహార్‌-జార్ఖండ్‌లలో బేస్‌ ఏరియాలను నిర్మించే కేంద్ర కర్తవ్యాన్ని చేపట్టడం రెండో వ్యూహాత్మక తప్పిదమని వేణుగోపాల్‌ విమర్శించారు. పార్టీ బలాన్ని అతిగా అంచనా వేసి, శత్రువు బలాన్ని తకువ చేసి చూశామని చెప్పారు. 2011 నుండే కిందిస్థాయి కామ్రేడ్స్‌ ఈ తప్పును సరిదిద్దుకోవాలని కోరినప్పటికీ, సీసీ పట్టించుకోలేదని తెలిపారు. ఒక దశాబ్దం పాటు నష్టపోయామని తెలిపారు. ఇప్పటికైనా అమరుల రక్తతర్పణం నుండి గుణపాఠాలను తీసుకుందామని పిలుపిచ్చారు.

చట్టబద్ధ పోరాటాలను విస్మరించాం

రహస్య, చట్టబద్ధ పోరాటాల మధ్య సమన్వయాన్ని కొనసాగించడంలో సెంట్రల్‌ కమిటీ పూర్తిగా విఫలమైందని ఇది మూడో తప్పిదమని వేణుగోపాల్‌ అభిప్రాయపడ్డారు. 2006 నూతన అటవీ చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చే భూమి పట్టాలను ‘బేస్‌ ఏరియాలు నిర్మిస్తున్నామనే ధీమాతో’ వ్యతిరేకించాం. దండకారణ్యంలోని రైతులకు మన జనతన సరార్‌లే పట్టాలిస్తాయని చెప్పాం, కానీ ఆ పట్టాలకు వ్యవస్థలో గుర్తింపు లేదనే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ను విస్మరించామని తెలిపారు.

ప్రజలు తమ జీవితావసరాల కోసం అనివార్యమైన ఆధార్‌ కార్డులు తెచ్చుకోవడాన్ని కూడా పార్టీ వ్యతిరేకించడం, ప్రజలు దొంగచాటుగా ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి వాటిని పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా, అభయ్ తన వద్ద గల ఆయుధా లను అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందుని పార్టీ ప్రకటన జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు మల్లోజుల ఈ విషయమై కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ ఆ లేఖలో వెల్లడించారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్కొంటూఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయా మంటూ క్షమాపణలు చెప్పారు. 

మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంధా పూర్తిగా తప్పిదమే అని అంగీకరించారు. తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మావోల లక్ష్యాన్ని నెరవేర్చలేమని తేల్చి చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్‌కు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల పిలుపునిచ్చారు.

మల్లోజుల వేణుగోపాల్ దివంగత మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి తమ్ముడు. వేణుగోపాల్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు. ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తారా లొంగిపోయారు.  కిషన్ జీ భార్య మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాత కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే పోలీసులకు లొంగిపోయారు. అటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవ రావు (ఆశన్న) కూడా లొంగుబాటు వైపు అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. 
 
మావోయిస్టు పార్టీని వచ్చే ఏడాది మార్చి 31లోపు తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు బలగాలు మావోయిస్టులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది పెద్ద స్థాయి నక్సలైట్లు ఎన్ కౌంటర్‌లో చనిపోతున్నారు. కొంత మంది లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మల్లోజుల కూడా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.