విశాఖలో ‘ఆండ్రోత్’ నౌక జాతికి అంకితం

విశాఖలో ‘ఆండ్రోత్’ నౌక జాతికి అంకితం

భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో మరో మైలురాయిని అధిగమించింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో సోమవారం భారత నౌకాదళానికి చెందిన రెండో యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌక ‘ఆండ్రోత్‌’ను వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధర్కర్ జాతికి అంకితం చేశారు. సముద్రంలో శత్రు జలాంతర్గాముల భద్రతాపరమైన కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో ఈ నూతన నౌకను రూపొందించారు.

ఆండ్రోత్ అనే పేరును లక్షద్వీప్ ద్వీప సమూహంలోని ఒక ద్వీపం నుంచి ఎంపిక చేశారు. ఈ నౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది. ఇటీవలి కాలంలో భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌకలైన అర్నాలా, నిస్తార్, ఉదయగిరి, నీలగిరి ప్రవేశించగా, తాజాగా ఆండ్రోత్ కూడా చేరడంతో సముద్ర భద్రతలో భారత నౌకాదళం మరింత బలోపేతం అవుతుంది.

ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధర్కర్ మాట్లాడుతూ, “స్వదేశీకరణ దిశగా ఇది భారత నౌకాదళానికి ఒక కీలక ముందడుగు. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది,” అని తెలిపారు. తాజాగా ఈ యుద్ధ నౌక ఆండ్రోత్ ప్రవేశంతో అదనపు బలం చేకూరినట్టు అయింది. కోల్కతా సంస్థ ఈ యుద్ధనౌక ఆండ్రోత్ను నిర్మించింది. దేశంలో ఎటువంటి సవాళ్లు ఎదురైనా నౌకాపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని  రాజేశ్ పెంధర్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక ఆండ్రోత్‌ భారత నౌకాదళంలో చేరడం ఓ అద్భుత ఘట్టంగా పరిగణించవచ్చు. ఆండ్రోత్‌ యుద్ధ నౌకలో దేశీయంగా రూపొందించిన 30 ఎంఎం సర్ఫేస్‌ గన్‌ ఉంది. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్‌ పెట్టింది. ఇందులో ఎనిమిదింటిని జీఆర్‌ఎస్‌ఈ ఉత్పత్తి చేస్తోంది. 

తీర ప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘా వేసే సామర్థ్యం వీటికి ఉంది. విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాములను ఇవి వేటాడగలవు. అధునాతన పోరాట నిర్వహణ వ్యవస్థలు వీటి సొంతం. ఈ యుద్ధనౌకల్లో తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు సైతం ఉండటం విశేషం.