పాక్ టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్‌ పై ఐసీసీ చర్యలు

పాక్ టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్‌ పై ఐసీసీ చర్యలు

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఒడిన పాకిస్థాన్‌ కు మరో షాక్. ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్‌ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చర్యలు తీసుకుంది. భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తను ఐసీసీ నియమావళిని ఉల్లంఘించడమే అందుకు కారణం. మ్యాచ్ అనంతరం రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్ పాక్ బ్యాటర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

విచారణలో అమిన్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు గుర్తించారు. దాంతో ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌ పోరాడగలిగే స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆదిలోనే పేసర్ క్రాంతి గౌడ్ షాకిచ్చింది. 20 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన అమిన్ జట్టును గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది

నటాలియా పర్వేజ్‌తో 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. స్వీప్ షాట్లతో అలరించిన అమిన్ అర్ధ శతకంతో ఆశలు రేపింది. కానీ, స్నేహ్ రానా వేసిన 40వ ఓవర్లో ఐదో బంతిని  స్వీప్ షాట్ ఆడగా అక్కడే కాచుకొని ఉన్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. అంతే, టీమిండియా ప్లేయర్లు సంబురాల్లో మునిగిపోగా వికెట్ పడిన కోపం, ఆదవేదనతో ఆమె తన బ్యాటును పిచ్‌మీద గట్టిగా కొట్టింది.

అయితే అమిన్ వ్యవహరించిన తీరును ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. మ్యాచ్ అనంతరం రిఫరీ అమిన్‌పై ఫిర్యాదు చేసింది. దాంతో పాక్ బ్యాటర్ క్షమాపణలు చెప్పింది. అయినా సరే ఆమె చేసిన నేరానికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ. మామూలుగా అయితే లెవల్ 1 తప్పిదానికి పాల్పడిన వాళ్లపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు.

భారత్ నిర్దేశించిన 248 పరుగుల ఛేదనలో అమిన్ మినహా అందరూ విఫలమయ్యారు. క్రాంతి గౌడ్ (3-20), దీప్తి శర్మ(3-45)లు మూడేసి వికెట్లతో పాక్ నడ్డి విరవగా టీమిండియా 88 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.