పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ బాంబు దాడి

పాకిస్థాన్‌లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది. క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుడులో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని షికార్‌పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రైలుపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, షికార్‌పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఉదయం 8:15 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పై దుండగులు అమర్చిన బాంబు పేలింది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు షికార్‌పూర్ డిప్యూటీ కమిషనర్ షకీల్ అబ్రో ధ్రువీకరించారు. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిలో నలుగురిని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి, మిగిలిన ముగ్గురిని షికార్‌పూర్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పేలుడు తర్వాత ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించి, రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించినట్లు సుక్కూర్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి మోహసిన్ అలీ సియాల్ వివరించారు.
ఈ ఘటనకు పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్ల బృందం బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ బాధ్యత వహించింది. ప్రమాద సమయంలో పాక్‌ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పేలుడు దాటికి అనేక మంది సైనికులు మరణించినట్లు పేర్కొంది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకూ ఇలాంటి దాడులు కొనసాగుతాయని ఈ సందర్భంగా హెచ్చరించింది.
 
జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు తరచూ దాడులకు గురవుతోంది. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరగడం ఈ ఏడాది ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాక్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేశారు. అందులోని వందలాది మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్‌ సైనికులను హతమార్చారు. 
 
అనంతరం పాక్‌ ఆర్మీ ఆపరేషన్‌ చేపట్టి బందీలను విడిచిపెట్టింది. ఆ తర్వాత జూన్‌లో మరోసారి ఈ రైలును లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. అంతేకాదు ఈ ప్రాంతంలో పాక్‌ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని బలోచ్‌ గ్రూప్‌ వరుస దాడులకు పాల్పడుతోంది.