వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. ఏటా వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచినవారికి అందించే ఈ నోబెల్‌ పురస్కారాలను దక్కించుకున్న వారి పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే మొట్టమొదట వైద్య రంగంలో చేసిన కృషికి గానూ ఈ సంవత్సరానికి ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది
 
మెడిసిన్ విభాగంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఇ బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచీకి ఈ అదృష్టం వరించింది. వీరిలో మేరీ ఇ బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ ఇద్దరు శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన వారు కాగా, షిమన్‌ సకాగుచీ జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త. రోగనిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారనే దానిపై పరిశోధన చేసినందుకు ఈ ముగ్గురికీ నోబెల్ బహుమతి వరించినట్లు నోబెల్ జ్యూరీ వెల్లడించింది.
 
అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ సిస్ట‌మ్స్ బ‌యోల‌జీలో మేరీ బ్రుంకోవ్ ప‌నిచేస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఉన్న సోనోమా బ‌యోథెర‌పాటిక్స్‌లో ఫ్రెడ్ రామ్స్‌డెల్ చేస్తున్నారు. జ‌పాన్‌లోని ఓసాకాలో ఉన్న ఓసాకా యూనివ‌ర్సిటీలో షిమోన్ స‌క‌గుచి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.  ఈ ముగ్గురు చేసిన ఆవిష్కరణలు కొత్త పరిశోధన రంగానికి పునాది వేశాయని, క్యాన్సర్ సహా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కొత్త చికిత్సలను డెవలప్ చేసేందుకు ఉపయోగపడ్డాయని తెలిపింది.వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం ఈనెల 13వ తేదీన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వరకు కొనసాగనుంది.

స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్‌, బిజినెస్‌మెన్‌గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఇక ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు 10 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1896లో మరణించగా, 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.