
నేపాల్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 51కి చేరింది. తూర్పు నేపాల్‌లో గత 24 గంటల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో ఈ మరణాలు సంభవించాయి. అత్యధికంగా ఇల్లాం జిల్లాలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యోదయ, మంగ్సేబంగ్, దేవ్ మై ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. పలువురు గాయపడగా అనేకమంది గల్లంతయ్యారు.
ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ సైన్యంతో పాటు పోలీసులు, ఇతర సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాల్లోని వానలకు కాఠ్ మాండూ లోయలోని భాగమతి, బిష్ణుమతి సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోకి వరదనీరు చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయాణాలు చేయవద్దని ప్రజలను అధికారులు సూచించారు.
కాఠ్ మాండూ సహా అనేక జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసి, ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విపత్తుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అక్కడి ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఎక్స్ వేదికగా తెలిపారు.
నదీ పరివాహ ప్రాంతాల్లో ఆకస్మిక వరదల కారణంగా వేలమంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. దీంతో అక్కడి ప్రజలకు సహాయం అందించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. భూటాన్ అధికారులు, భారత సైనికులు సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భూటాన్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడి బాధితులను తరలిస్తున్న భూటాన్ హెలికాప్టర్ పని చేయకపోవడంతో ఆ దేశం భారత్‌ను అత్యవసరం సాయం కోరిందని అధికారిక వర్గాలు వివరించాయి. దీంతో వెంటనే స్పందించిన భారత్ సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలించింది. వారికి తక్షణ వైద్య సహాయం అందేలా రెండు హెలికాప్టర్లను మోహరించిందని తెలిపాయి.
More Stories
పాక్ ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు
ఖలిస్థాన్ ఉగ్రవాదులకు నిధులపై కెనడా నిఘా
పీఓకేలో నిరసనలకు దిగివచ్చిన పాక్ ప్రభుత్వం