నవంబర్‌ 22లోగా బీహార్‌ ఎన్నికలు

నవంబర్‌ 22లోగా బీహార్‌ ఎన్నికలు
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని విధాలుగా సిద్ధమైంది. నవంబర్‌ 22 లోగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొంది. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థుల కలర్‌ ఫొటోలను పెట్టనున్నామని, కలర్‌ ఫొటోలు పెట్టడం ఇదే తొలిసారి అని ఈసీఐ తెలిపింది.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు రోజులపాటు పర్యటించి, సమీక్షించిన ఎన్నికల సంఘం వాటికి సంబంధించిన వివరాలను పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించింది. ఈ సందర్భంగా పుట్టిన తేదీ, పౌరసత్వానికి ఆధార్‌  ధ్రువీకరణ కాదని మరోసారి స్పష్టంచేసింది. చట్టానికి లోబడే ఆధార్‌ను ఉపయోగిస్తున్నామని ఈసీ తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని, గరిష్ఠంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండనుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటికే బూత్‌ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశామన్న ఈసీ.. ఎన్ని దశల్లో పోలింగ్‌ నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. 

“బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్వహించాలని కొందరు వాదించారు. అలా మాట్లాడటం సరికాదు. ప్రతీ ఎన్నికకు ముందుగానే ఎస్ఐ‌ఆర్ ప్రక్రియను నిర్వహించాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతోంది. మేం చట్టపరంగానే ముందుకు పోయాం. రాష్ట్రంలో ఎస్ఐ‌ఆర్‌ను నిర్వహించాం” అని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థుల కలర్‌ ఫొటోలను ఉంచనున్నామని వెల్లడించింది. తద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలికగా గుర్తుపట్టేందుకు వీలుంటుందని ఈసీ తెలిపింది. సీరియల్‌ నంబర్‌ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ చెప్పారు.  ఎస్ఐఆర్‌ ద్వారా అనర్హులను జాబితా నుంచి తొలగించామని, దీన్ని బీహార్‌ ఓటర్లు కూడా స్వాగతించారని పేర్కొంది. వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఉందని పేర్కొన్నారు.

“ఎన్నికల్లో పారదర్శకత కోసం మాక్ పోల్స్‌ను నిర్వహించడం తప్పనిసరి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులంతా వారి పరిధిలోని పోలింగ్ బూత్‌లకు పోలింగ్ ఏజెంట్లను నామినేట్ చేయాలి. ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందే పోలింగ్ బూత్‌లకు పోలింగ్ ఏజెంట్లు చేరుకోవాలి. మాక్ పోల్స్‌ను ఆ ఏజెంట్లు స్వయంగా చూడాలి. పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ ముగిశాక అక్కడున్న ప్రిసైడింగ్ అధికారి నుంచి ఫామ్ 17సీని పొందాలి” అని  జ్ఞానేశ్ కుమార్ సూచించారు.