
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశంలో బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ వెల్లడించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
బిహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 11 వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. తాజా షెడ్యూల్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను స్క్రుటినీ చేస్తారు. వచ్చే నెల 11వ తేదీన ఉపఎన్నిక నిర్వహిస్తారు. 14వ తేదీన కౌంటింగ్ చేసి, ఫలితాలు విడుదల చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాతే వీవీ ప్యాట్, ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్ ఎన్నికల షెడ్యూల్తోపాటూ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.
243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగియనుంది. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ గడువులోగా ఎన్నికలు పూర్తిచేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా, 2020లో జరిగిన ఎన్నికల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగగా అంతకుముందు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. బీహార్‌లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. సెప్టెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రచురించింది.
కాగా, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, పారదర్శకత కోసం తీసుకొచ్చిన 17 సంస్కరణలను బీహార్ ఎన్నికల నుంచే అమలు చేయనుంది. వీటిలో పోలింగ్ సందర్భంగా కొన్ని, ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని అమలవుతాయి. ఇకపై ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు. తాజా సవరణతో బీహార్‌లో ప్రస్తుతమున్న 77,895 పోలింగ్ కేంద్రాలు 90,712కి పెరుగనున్నాయి.
ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోలను ప్రచురించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెందిన కలర్ ఫోటోలు, పేర్లు ఈవీఎం మెషీన్లపై ఉంటాయి. అభ్యర్థులను గుర్తించేందుకే ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి ఫిర్యాదులకైనా 1950 నెంబర్‌కు ఓటర్లు డయల్ చేయొచ్చని సీఈసీ తెలిపారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ద్వారా జరిగే అనేక కొత్త మార్పులను సీఈసీ వెల్లడించారు.
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అందులో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు- 38, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు- 2 ఉన్నాయి. బిహార్‌లో 7.42 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళా ఓటర్లు 3.50 కోట్లు ఉన్నారు. బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22లోపు ముగియనుంది. ఆ లోపే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు ఈసీ ఇంతకుముందు తెలిపింది. ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్)తో ఓటర్ల జాబితా ‘శుద్ధీకరణ’ జరిగిందని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజుల పాటు బిహార్‌లో పర్యటించింది.
More Stories
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి