సీజేఐ జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై దాడి యత్నం

సీజేఐ జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై దాడి యత్నం
సుప్రీంకోర్టులో సోమవారం సీజేఐ బీఆర్ గ‌వాయ్‌పై ఓ న్యాయవాది త‌న బూటు విసిరేందుకు ప్ర‌య‌త్నించారు. సీజేఐ కూర్చున్న డ‌యాస్ వ‌ద్ద‌కు ఓ లాయ‌ర్ వెళ్లి త‌న కాలుకున్న బూటును తీసి, జ‌డ్జీ మీద‌కు విసిరే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓ కేసు వాద‌న‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో సనాతన ధర్మానికి అవమానం జరిగితే సహించేది లేదని ఆ న్యాయవాది గట్టిగా నినాదాలు చేశారు. సీజేఏ ఏమాత్రం కంగారు పడకుండా కోర్టులో ఉన్న న్యాయవాదులను తమ వాదనలు కొనసాగించమని కోరారు.  ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని జస్టిస్‌ గవాయ్‌ తేల్చి చెప్పారు. అయితే దాడి యత్నం నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద పలువురు న్యాయవాదులు ఆందోళన చేశారు.

కాగా, కొన్ని రోజుల క్రితం సీజేఐ గ‌వాయ్‌ ఓ కేసులో చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఖ‌జుర‌హోలోని ఏడు అడుగ‌ల విష్ణు విగ్ర‌హాన్ని పున‌ర్ ప్ర‌తిష్టించాల‌ని దాఖ‌లు చేసిన కేసులో సీజేఐ గ‌వాయ్ కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఆ కేసును ఆయ‌న డిస్మిస్ చేస్తూ వెళ్లి ఆ దేవుడినే అడుక్కోవాల‌ని సూచించారు. 

విష్ణువుకు వీర‌భ‌క్తుడిని అని చెప్పుకుంటున్నావు కాదా, వెళ్లి ఆ దేవుడినే ప్రార్థించుకో, అదో ఆర్కియాల‌జీ సైట్ అని, దానికి ఏఎస్ఐ ప‌ర్మిష‌న్ అవ‌స‌రం ఉంటుంద‌ని ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యానించారు. ఖ‌జుర‌హో కేసులో సీజేఐ గ‌వాయ్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియాలో తీవ్ర దుమారం చెల‌రేగింది. మ‌త‌ప‌ర‌మైన భావాల‌ను కించ‌ప‌రిచిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

అయితే ఆ వివాదానికి రెండు రోజుల త‌ర్వాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మ‌తాన్ని అమ‌ర్యాద‌ప‌ర‌చ‌లేద‌ని తెలిపారు. అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తాన‌ని, కేవ‌లం సోష‌ల్ మీడియాలోనే త‌న వ్యాఖ్య‌లు ప్ర‌చారం అయిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా సీజేఐకి అండ‌గా నిలిచారు. సోష‌ల్ మీడియాల్లో కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌తిచ‌ర్య‌లు భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు.