అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు

అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీలు  వేయాలని  బిజెపి రాష్ట్ర పదాధికారుల  సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో  జిల్లా అధ్యక్షుడు, ఇన్‌చార్జ్‌, అబ్జర్వర్‌లతో త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా బహిరంగ సభలు జరపాలని నిర్ణయించారు.  కనీసం 15 జడ్పీ చైర్మన్‌లు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించాలని భావించారు.
ఎంపీలు ఉన్న చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, మిగతా ప్రాంతాల్లో పార్టీ విస్తరణే లక్ష్యంగా ప్రణాళికలు ప్రణాళిక రచించాలని ఎంపీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సూచించారు.  సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్ష నాయకులుఏ.వి.ఎన్. రెడ్డి, బిజెపి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం, ప్రత్యేకంగా గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన అంశాలను, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను, మోసాలను ప్రజలకు తెలియజెప్పేలా ప్రచారం జరపాలని నిర్ణయించారు. 

బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో గత 22 నెలలుగా  కాంగ్రెస్ సర్కారు చేసిన కుట్రలు, నాటకాలను, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా గ్రామీణ పాలనను నిర్వీర్యం చేసిన విషయాలను స్పష్టంగా ప్రజలకు తెలియ చెప్పాలని ప్రణాళిక రూపొందించారు. పాత, కొత్త నాయకులు అనే భేదం లేకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి పార్టీ శ్రేణులను మోటివేట్ చేయాలని రాంచందర్ రావు సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాల్లో పార్టీ విజయం సాధించడానికి ఓ బృందంగా  సమిష్టి కృషి జరపాలని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారం సాధించేలా సంస్థాగతంగా ఎన్నికల సంసిద్ధతపై కూడా దృష్టి పెట్టారు. అక్టోబర్ 8వ తేదీన మరో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, ఇంచార్జెస్, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో చర్చించి, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తమవ్వాలని నిర్ణయించారు.

సికింద్రాబాద్ పార్లమెంటు నిమోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక దృష్ట్యా ప్రత్యేక ఎజెండా రూపకల్పన చేసి, నగర ప్రాంతాల్లో నాయకులు కూడా పూర్తిగా పాల్గొనాలని నిర్ణయించారు. ఈ ఉప ఎన్నిక కోసం  ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థి ఎంపిక, అభిప్రాయ సేకరణ, ప్రకటన జరుగుతుందని తెలిపారు.