పీఓకేలో నిరసనలకు దిగివచ్చిన పాక్ ప్రభుత్వం

పీఓకేలో నిరసనలకు దిగివచ్చిన పాక్ ప్రభుత్వం
 
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మంది మృతి చెందిన రోజుల నిరసనల తర్వాత, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం శనివారం వెనక్కి తగ్గి, పోకెలో హింసను అంతం చేసే లక్ష్యంతో నిరసనకారులతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల అధికారి తారిఖ్ ఫజల్ చౌదరి  ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయని ప్రకటించారు.
 
“చర్చల ప్రతినిధి బృందం యాక్షన్ కమిటీతో తుది ఒప్పందంపై సంతకం చేసింది. నిరసనకారులు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు. అన్ని రోడ్లు తిరిగి తెరవబడ్డాయి. ఇది శాంతికి విజయం” అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేకేజేఏఏసీ) 38 పాయింట్ల చార్టర్‌ను ప్రతిపాదించింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం 25 అంశాలపై అంగీకరించింది. ఆ వివరాలను చౌదరి ఎక్స్ లో పంచుకున్నారు. 
 
పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో పోకెలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. నిరసనలు 12 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 200 మందికి పైగా గాయపడ్డారు. జేకేజేఏఏసీ నేతృత్వంలోని నిరసనకారులు ప్రాథమిక హక్కులు, న్యాయం, వ్యవస్థాగత అణచివేతగా వారు అభివర్ణించిన దానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.  జేకేజేఏఏసీ, ప్ర‌భుత్వం మ‌ధ్య‌ సెప్టెంబ‌ర్ 29వ తేదీన జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో అక్క‌డ హింస మొద‌లైంది. 
 
నిర‌స‌న స‌మ‌యంలో వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన కాల్పుల్లో ప‌ది మంది మ‌ర‌ణించారు. కుట్ర‌లు, అవాస్త‌వాల‌న్నీ స‌మ‌సి పోయిన‌ట్లు ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌క‌టించారు. జేఏఏసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్ర‌భుత్వ క‌మిటీకి ధ‌న్యావాదాలు తెలిపారు. శాంతి, సామ‌ర‌స్యం ఏర్ప‌డ‌డం మంచి సంకేతం పేర్కొన్నారు.
 
సిబ్బంది, నిరసనకారుల మరణాలకు దారితీసిన హింస, విధ్వంసక సంఘటనలపై ఉగ్రవాద నిరోధక చట్టంలోని సంబంధిత విభాగం కింద ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడానికి, అవసరమైన చోట న్యాయ కమిషన్‌ను నియమించడానికి ప్రభుత్వం అంగీకరించింది. నిధుల విడుదల ప్రణాళిక ప్రకారం, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం 10 బిలియన్ రూపాయలను అందిస్తుంది.