
సామాజిక భద్రత కల్పనలో విశిష్ట కృషికి గాను ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ సామాజిక భద్రత సంఘం (ఐఎస్ఎస్ఏ) పురస్కారం-2025’ను భారత్‌కు ప్రకటించారు. ఈ అవార్డును మలేసియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించిన వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరమ్ (డబ్ల్యూఎస్ఎస్ఎఫ్)లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2015లో సామాజిక భద్రత పరిధిలో 19 శాతం మంది ఉంటే, ఈ సంవత్సరం (2025)లో 64.3 శాతం మంది వచ్చారనీ, ప్రస్తుతం 94 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గుర్తించిందని కూడా ఆయన పేర్కొన్నారు. సామాజిక భద్రత పరిధిని విస్తరించిన తర్వాత, ఐఎస్ఎస్ఏ సాధారణ సభలో భారత్ వాటా 30కి చేరింది. ఐఎస్ఎస్ఏ సాధారణ సభలో ఏ దేశానికైనా అత్యధికంగా లభించే ఓట్ షేరు ఇది.
భారత ప్రభుత్వం పక్షాన పురస్కారాన్ని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అందుకున్నారు. ‘‘ఈ పురస్కారం సమాజంలో ఆఖరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం సాధికారతను కల్పించాలని ప్రబోధిస్తూ మాకు మార్గదర్శకంగా నిలుస్తున్న అంత్యోదయ సిద్ధాంతంతో పాటు మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం. అందరికీ సామాజిక భద్రతను సమకూర్చే దిశగా పయనించాలని మాకు అంత్యోదయ సూచిస్తోంద’’ని మంత్రి తెలిపారు.
ప్రపంచమంతటా సామాజిక భద్రత కల్పన వ్యవస్థలో భారత్ సాధించిన అసాధారణ ప్రగతికి దక్కిన గుర్తింపే ఈ పురస్కారం. ఈ పురస్కారాన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రకటిస్తున్నారు. 163 దేశాలకు చెందిన 1,200 కన్నా ఎక్కువ సామాజిక భద్రత విధాన రూపకర్తలు, వృత్తినిపుణులు పాల్గొన్న డబ్ల్యూఎస్ఎస్ఎఫ్ కార్యక్రమంలో ఈ పురస్కార ప్రదానం ముఖ్య ఆకర్షణగా నిలిచింది.
ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిని అందుకొన్న అయిదో దేశం భారత్. ఈ పురస్కారం సామాజిక పరిరక్షణ రంగంలో గొప్పగా కృషి చేస్తూ మార్గదర్శిగా నిలుస్తున్న దేశాల సరసన భారత్‌నూ నిలబెట్టింది. ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిని, ఉద్యోగాలను ఇచ్చే సంస్థలనూ ఒకే వేదిక మీదకు తీసుకు రావడానికి పటిష్ఠ డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉండే నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ రూపొందించినట్లు కూడా డాక్టర్ మాండవీయ తెలిపారు.
‘‘చేయి తిరిగిన కార్మికులకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని ఎన్‌సీఎస్‌లో పొందుపరిచారు. ఈ సమాచారాన్ని ప్రపంచం నలు మూలల యాజమాన్య సంస్థలు సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్నంతటినీ ఈ-శ్రమ్ పోర్టల్‌కు కూడా అందిస్తారు. దీంతో మా నిపుణులైన యువ కార్మికులు వారి సామాజిక భద్రత ప్రయోజనాలను నష్టపోకుండానే వివిధ దేశాల్లో ఏయే మెరుగైన అవకాశాలు వారికి లభించనుందీ తెలుసుకోగలుగుతార’’ని మంత్రి వివరించారు.
More Stories
ఆత్మపరిశీలన, పునఃసమర్పణకు అవకాశంగా ఆర్ఎస్ఎస్ వందేళ్లు
‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్లు కాదు, శాంతిభద్రతల సమస్య
పీఓకేలో నిరసనలకు దిగివచ్చిన పాక్ ప్రభుత్వం