హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు

హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు

దసరా పండుగ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని బస్సుల్లో ఛార్జీలను టీజీఎస్ ఆర్టీసీ పెంచింది.పెంచిన ఛార్జీలను ఈ నెల 6వ తేదీ నుంచి వసూలు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సుల కోసం మరో పది డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరం అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.  డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాల్సి వస్తుందని, అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. 

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.  సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్ ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5, 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు మొత్తాన్ని వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి 5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు.

హైదరాబాద్‌లో ప్రజా రవాణా మెరుగుపర్చేలా చర్యలు చేపట్టిన ఆర్టీసీ, పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. మరిన్ని బస్సులు తీసుకొస్తే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం, ప్రజా రవాణా వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ఎలక్ట్రిక్ బస్సులకు మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 25  డిపోలుంటే 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.  ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో ఛార్జింగ్ కోసం హెచ్​టీ కనెక్షన్లు ఏర్పాటు చేసింది. మరో 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్​టీ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలు, 10 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది.

 వాటి మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఏడాది నుంచి రూ.392 కోట్ల మేర వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ భారాన్ని మోసే అవకాశం లేనందున సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని వసూలు చేసేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని, అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.