బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మెర్ 8,9  తేదీల్లో భారత పర్యటన

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మెర్ 8,9  తేదీల్లో భారత పర్యటన
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మెర్ భారత పర్యటనకు మొదటిసారి రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన స్టామెర్ రెండు రోజుల పర్యటన కోసం వచ్చే వారం భారత్ కు విచ్చేయనున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 8, 9 తేదీల్లో స్టార్మెర్, మోదీ సమావేశం అవుతారని, ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం.

బ్రిటన్ ప్రధాని పర్యటన సందర్భంగా ‘విజన్ 2035’ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. ఈ పదేళ్ల ప్రణాళిక భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రతపరమైన అంశాలకు సంబంధించినది. అంతేకాదు శక్తి, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాల పురోగతి కోసం ఈ విజన్ 2035 ఉపయోగపడనుంది. 

పర్యటనలో రెండో రోజైన అక్టోబర్ 9న మోదీతో కలిసి స్టార్మెర్ ముంబైలో వ్యాపార, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఇరుదేశాల మధ్య క్రాంప్రెహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ (సిఈటిఏ)లో ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం అంశాలపై కూడా మోదీ, స్టార్మెర్ మధ్య చర్చ జరిగే అవకాశముంది.  అనంతరం ఇరువురు ‘గ్లోబల్ ఫిన్‌టెక్’ ఆరో సీజన్ వేడుకలో పాల్గొంటారు.

ఈ ఏడాది జూన్‌లో మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ స్టార్మెర్‌ను అధికారిక నివాసం ‘చెకెర్స్‌’లో కలిసిన మోదీ 2035 స్ట్రాటజీని ప్రస్తావించారు. ఈ సమయంలోనే భారత్, బ్రిటన్ ప్రతినిధులు మధ్య రక్షణ, పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌పై సంతకాలు చేశాయి.