ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత

ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత
కొంతకాలంగా తీవ్ర ’లల్లాదేవి’ పేరుతో పలు కథలు, నవలలు రాసిన పరుచూరి నారాయణాచార్యులు (80) శుక్రవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. ఆయనకు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1980 దశకంలో తెలుగు సాహితీ రంగంలో సుప్రసిద్ధులైన రచయితల్లో లల్లాదేవి కూడా ఒకరు. 
 
ఆయన రాసిన పలు నవలలు ముందు సీరియల్స్‌గా వచ్చాయి. చారిత్రక, జానపద, సాంఘిక రచనలు చేయడంతో ఆయన దిట్ట. పాములపై పరిశోధన చేసిన ఏకైక రచయితగా ఆయనకు పేరు. పలు తెలుగు సినిమాలకు కూడా రచయితగా ఆయన పనిచేశారు. లల్లాదేవి పేరు చెప్పగానే సినీ ప్రియులకు వెంటనే గుర్తుకొచ్చే చిత్రం ‘శ్వేతనాగు’. ఆయన రాసిన ఈ సంచలన నవల ఆధారంగానే దివంగత నటి సౌందర్య 100వ చిత్రం తెరకెక్కింది. 
 
ఈ సినిమా అప్పట్లో అద్భుత విజయం సాధించి, ‘లల్లాదేవి’ కీర్తిని మరింత పెంచింది. ఆయన కలం నుంచి జాలువారిన ఎన్నో గొప్ప కథలు, నవలలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా రంగంతో లల్లాదేవికి విడదీయరాని అనుబంధం ఉంది. ‘జాన పద బ్రహ్మ’గా పేరుగాంచిన బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘కరుణించిన కనకదుర్గ’ (1992)కు కథను అందించింది కూడా ఆయనే. 
 
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కెఆర్ విజయ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన రాసిన మరికొన్ని నవలలు కూడా సిని మాలుగా రూపుదిద్దుకు న్నాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘లల్లాదేవి’ అనే కలం పేరు కారణంగా చాలామంది ఆయనను ఒక మహిళా రచయిత్రిగా భావించేవారు. కానీ అది కేవలం ఆయన కలం పేరు మాత్రమేనని, అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు అని తెలిసిన వారు చాలా తక్కువ. 
 
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకి పరుచూరి నారాయణాచార్యులు అత్యంత సన్ని హితులు. కొంతకాలం ఆయన దగ్గర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ’లల్లాదేవి’ మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశారు. ’లల్లాదేవి’ స్వగ్రామం గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డవారి పాలెం. ఆయన కొన్ని వందల కథలు, నవలలు, నాటికలు, నాటకాలు రాశారు.