అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది

అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది
 
దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ, పౌరుల భద్రత కోసం అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ విషయాన్ని 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు, ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన శక్తి సామర్థాలను ప్రదర్శించిందని గుర్తు చేశారు.  జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్‌ఐసీసీలలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి శుక్రవారం ప్రారంభించిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు.
 
మతమేంటో తెలుసుకుని మరీ అమాయకులైన ఎంతోమందిని ఉగ్రవాదులు పహల్గాంలో దారుణంగా హతమార్చారని పేర్కొంటూ అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకే చేపట్టిందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి కారకులైన వారిపై ప్రతీకారంగానే పాకిస్తాన్ పరిధిలోని ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేపట్టింది తప్ప పాకిస్తాన్ మిలటరీ, సాధారణ పౌరులపై కాదని పేర్కొన్నారు. 
 
సైనిక, ఆర్థిక శక్తిని పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం ఆధిపత్యం కోసం కాదని, భగవాన్ మహావీర్ బోధనలలో ప్రతిబింబించే విలువలలో కూడిన ఆదర్శాలను కాపాడటం కోసమేనని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలో ఎన్‌డిఏ ప్రభుత్వం కొలువుదీరిన పదకొండు సంవత్సరాల తర్వాత దేశ రక్షణ ఉత్పత్తులు రూ.600 కోట్ల నుంచి ఇప్పుడు రూ.24 వేల కోట్లకు పెరిగిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 

 
ఈ ఎగుమతులు 2029 నాటికి రూ.50 వేల కోట్లకు చేరుకుంటుందని వెల్లడించారు. భారత్ తన సొంత రక్షణ ఉత్పత్తులపై దృష్టికి కేంద్రీకరించడం ద్వారా విదేశీ రక్షణ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించిందని చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) నుంచి 97 తేలికపాటి యుద్ద విమానాలను సమీకరించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకుందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం ‘లోకల్ ఫర్ గ్లోబల్’ ‘ఓకల్ ఫర్ లోకల్’తో దేశం ఇప్పుడు బొమ్మల నుంచి యుద్ద ట్యాంక్‌ల వరకు ఎన్నో రకాల రక్షణ సామాగ్రిని సమీకరిస్తోందని వెల్లడించారు. ‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్‌గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. 

 
ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారని, కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటన్నారని చెప్పారు. 
 
ముఖ్యంగా వృద్ధి నైతికమైనదా, సమ్మిళితమైనదా, సుస్థిరమై నదా? అని అధ్యయనం చేసిన తర్వాతే అడుగు ముందుకేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ అవకాశాల గని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని మంత్రి వివరించారు.