పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇస్లామాబాద్ కచ్చితంగా జవాబుచెప్పాలని భారత్ డిమాండ్ చేసింది. పీవోకేలో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తమ వనరులను పాక్ దోచుకుంటోందంటూ ప్రజలు రోడ్డెక్కారు. తమకు కనీస హక్కులు, న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
వారిని అణచివేసే క్రమంలో పాక్ సైన్యం చేసిన దాడుల్లో 12 మంది అమాయక పౌరులు బలయ్యారు. 150 మంది వరకు గాయపడ్డారు. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ వనరుల దోపిడి కోసం పాక్ సాధారణంగా అవలంభించే అణచివేతలో ఈ చర్యలు భాగమని చెప్పారు. “పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరగడాన్ని గమనిస్తున్నాం. అమాయక పౌరులపై పాక్ బలగాల దారుణాలను పరిశీలిస్తున్నాం. ఇవి పాకిస్తాన్ కొనసాగించే సాధారణమైన అణచివేతలో భాగమేనని నమ్ముతున్నాం” అని స్పష్టం చేశారు.
“పాకిస్థాన్ బలవంతపు, చట్టవిరుద్ధమైన ఆక్రమణలో ఉన్న ఆ ప్రాంతంలోని వనరులను వ్యవస్థాగతంగా దోచుకునేందుకు పాక్ ఈ ధోరణి పాటిస్తుంది. ఈ క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాకిస్థాన్ కచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాలి” అని జైస్వాల్ స్ఫష్టం చేశారు. పాకిస్థాన్ అణచివేత విధానమే ఈ అశాంతికి దారితీసిందని విదేశాంగశాఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే పీవోకేలో చెలరేగిన అల్లర్లకు భారత్ కారణమని పాకిస్థాన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.
మన శత్రుదేశానికి ఉపయోగపడేలా నిరసనలకు దిగొద్దని నిరసనకారులను పాక్ మంత్రి అహ్సన్ ఇక్బాల్ కోరారు. ఈ విధంగా తమ పాకిస్థాన్ ప్రభుత్వ అశక్తతను భారతపై రుద్దాలని చూశారు. పీవోకే మన దేశంలో అంతర్భాగమని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది.
“కశ్మీర్ విషయంలో ఇండియాకు స్పష్టమైన వైఖరి ఉంది. పాకిస్థాన్- ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం మినహా మరో దారి లేదు. అంతకుమించి మేము మాట్లాడేది లేదు. ఉగ్రవాదుల అప్పగింతపై పాకిస్థానీయులు మాట్లాడితే మేమూ మాట్లాడతాం. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని భారత్ కోరుకోవడం లేదు. ఎవరూ దాయాదుల మధ్య మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు” అని ఆపరేషన్ సిందూర్ సమయంలోనే భారత్ తేల్చిచెప్పింది.
పీవోకేలో సెప్టెంబర్ 26 నుంచి అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్ తమ దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లకుపైగా పీవోకేలోని ప్రజలకు కనీసం ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని వాపోతున్నారు. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం “షటర్-డౌన్, వీల్-జామ్” పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

More Stories
భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తున్న వందేమాతరం
ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం
బీఎంసీ ఎన్నికల్లో బిజెపి 150 సీట్ల వరకు పోటీ!