నవంబరు 23న భారత్‌కు నీరవ్ మోదీ?

నవంబరు 23న భారత్‌కు నీరవ్ మోదీ?

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి భారత్ నుంచి పరారై, ప్రస్తుతం బ్రిటన్‌లో దాక్కున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని నవంబరు 23న భారత్‌‌కు తీసుకొచ్చే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. ఇదే జరిగితే, సుదీర్ఘ కాలంగా బ్రిటన్‌లో భారత దర్యాప్తు సంస్థలు చేస్తున్న న్యాయపోరాటం ఫలించినట్టు అవుతుంది. 

నీరవ్ మోదీని ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ తప్ప మరే ఇతర అభియోగాల గురించి విచారించేది లేదంటూ అధికారిక సార్వభౌమ పూచీకత్తుతో ఓ లేఖను ఇటీవలే బ్రిటీష్ సర్కారుకు, భారత ప్రభుత్వం అందించింది. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్ అండ్ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సంయుక్తంగా ఈ పూచీకత్తు లేఖను బ్రిటన్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమర్పించాయి.

తాము మినహా మరే ఇతర దర్యాప్తు సంస్థలకు నీరవ్‌ను అప్పగించేది లేదని ఈ లేఖ ద్వారా హామీ ఇచ్చాయి. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురాగానే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలిస్తారని సమాచారం. ఈ జైలులో సాధారణ ఖైదీల సెల్‌లకు దూరంగా హైప్రొఫైల్ ఖైదీల కోసం విశాలమైన ప్రత్యేక సెల్‌లు ఉన్నాయి. వీటిలోనే ఒకదానిలో (బ్యారక్ నంబర్ 12లో) నీరవ్ మోదీని ఉంచుతారని అంటున్నారు. 

బ్రిటన్ అధికారులు, కోర్టుల సూచనల మేరకు ఈ సెల్‌లో నీరవ్‌కు పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.6,498 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడనే అభియోగాలను వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ మోసానికి పాల్పడిన అనంతరం నీరవ్ మోదీ నేరుగా బ్రిటన్‌కు పారిపోయాడు. దీంతో 2018లో అతడిని భారత సర్కారు ఆర్థిక మోసం చేసి పారిపోయిన వ్యక్తిగా ప్రకటించింది. 

నీరవ్‌కు చెందిన దాదాపు రూ.2,598 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ జప్తు  చేసింది. వీటిలో రూ.981 కోట్లను బాధిత బ్యాంకులకు అందజేశారు. యూకేలో అతడికి ఉన్న రూ.130 కోట్లు విలువైన ఆస్తులను భారత్‌కు బదిలీ చేయాలనే దానిపై భారత దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. అతడి మోసాల చిట్టాను బ్రిటన్ సర్కారుకు భారత దర్యాప్తు సంస్థలు అందజేశాయి. 

ఈనేపథ్యంలో బ్రిటన్‌లో 2019 మార్చిలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని అక్కడి దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఆయా కేసుల విచారణ కోసం అతడిని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టులను భారత దర్యాప్తు సంస్థలు ఆశ్రయించాయి. బ్రిటన్‌లోని దిగువ కోర్టుల నుంచి హైకోర్టు దాకా అన్నీ నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని ఆదేశించాయి. దీంతో చివరకు ఈ అంశం బ్రిటన్ సర్కారు వద్దకు చేరింది.