భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్‌ సంతగా స్వదేశీ సంత

భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్‌ సంతగా స్వదేశీ సంత

భారతీయ ఉత్పత్తులకు స్వదేశీ సంత రానున్న రోజుల్లో గ్లోబల్‌ సంతగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పౌరులుగా మన దేశీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 

జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ విగ్రహం వద్ద పూజలు చేశారు. విజయదశమిని పురస్కరించుకుని జమ్మిచెట్టుకు నమస్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ జమ్మిచెట్టు ఆకులను సీఎంకు అందజేశారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. చేతివృత్తి కళాకారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి ఎంత ఆదాయం వస్తోందీ ఆరా తీశారు. ఖాదీ ఉద్యమంలోను- స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి ఫొటోఎగ్జిబిషన్‌తోపాటు వందేళ్ల రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రస్థానంలో రాష్ట్రంలో చేసిన సేవ కార్యక్రమాల స్టాల్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. గాంధీజీ అంటే గుర్తుకొచ్చేది ఖాదీ అంటూ వేదికపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి నూలు వడికారు.

అగ్గిపెట్టెలో పట్టే శాలువాను సీఎం చంద్రబాబు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారాణి పీవీ సింధుకు విజయ దశమి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గాంధీజీ, స్వదేశీ, సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం నేర్పించారని గుర్తు చేశారు.  నాడు విదేశీ వస్తువులను బహిరంగంగా తగులబెట్టాలని పిలుపునిచ్చారని, ఎంతో మంది త్యాగాలు చేశారని, ఆ పోరాటమే స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికిందని వివరించారు.

మొన్నటి వరకు విదేశీ వస్తువులు వాడామని, విదేశీ సాంకేతికతపై ఆధారపడ్డామని, ప్రధాని నరేంద్రమోదీ చొరవతో మేకిన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ వంటి కార్యక్రమాలతో స్వయం ప్రతిపత్తి సాధిస్తూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తున్నామని తెలిపారు.  రానున్న రోజుల్లో దేశ జనాభా 165 కోట్ల చేరుతుందని, అత్యధిక జనాభాతో ప్రపంచం మొత్తానికి అతిపెద్ద మార్కెట్‌గా నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

2038 నాటికి ఆర్ధికంగా మన దేశం రెండోస్థానంలో, 2047 నాటికి మొదటి స్థానంలో ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. యాచించే పరిస్థితుల్లో లేకుండా శాసించే పరిస్థితిలో నిలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కుటుంబ విలువలు భారత్‌లో ఉన్నాయని , విలువలు గల దేశాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఆర్థికంగా ఎదిగినా మూలాల్ని మరిచిపోకుండా ఉంటే బలంగా ఉంటామని అభిప్రాయపడ్డారు.