దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి

దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి
 
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు గురువారం రాత్రి రక్తసిక్తంగా మారింది.  దేవ‌ర‌గ‌ట్టులో ప్రారంభ‌మైన బ‌న్ని జైత్ర‌యాత్ర‌లో  భాగంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. ఎలాగైనా దేవతామూర్తులను తమ ప్రాంతానికే తీసుకెళ్లాలని మూడు గ్రామాల భ‌క్తులు ఒక వైపు, మ‌రో 7 గ్రామాల భ‌క్తులు మ‌రోవైపు క‌ర్ర‌ల‌తో త‌ల‌ప‌డ్డారు.  ఈ సందర్భంగా భక్తులంతా రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. 
 
ఈ స‌మ‌రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. తీవ్రంగా గాయ‌ప‌డిన వారింద‌రిని ఆదోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దేవ‌ర‌గ‌ట్టులో పోలీసులు భారీగా మోహ‌రించారు. జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్, ఆదోని స‌బ్ క‌లెక్ట‌ర్ మౌర్య భ‌ర‌ద్వాజ్, ప‌త్తికొండ ఆర్డీవో భ‌ర‌త్ నాయ‌క్ ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

దేవ‌ర‌గ‌ట్టులో ప్రతి ఏటా నిర్వహించే సుమారు 800 అడుగుల ఎత్తైన కొండ‌పై వెల‌సిన మాళ మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ద‌స‌రా బ‌న్ని ఉత్స‌వానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఈ సమరాన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. ఈ కర్రల సమరంలో చాలా మంది భక్తులు గాయపడతారు. గాయపడిన వారికి అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని పెద్ద ఆస్పత్రులకు తరలిస్తారు. 

చాలా మంది భక్తులు గాయాలపాలైనా, స్థానికంగా దొరికే బండారు (పసుపు) పూసుకుని ఎలాంటి చికిత్స తీసుకోకుండానే వెళతారు. త్రేతా యుగంలో దేవరగట్టు కొండల్లో మునులు లోక కల్యాణం కోసం యజ్ఞాలు చేశారు. మణి, మల్లాసుర అనే రాక్షసులు వాటిని అడ్డుకున్నారు. వారి ఆగడాలు భరించలేకపోయిన మునులు, తమను రక్షించమని శివపార్వతులను వేడుకున్నారు. మునుల విన్నపాన్ని ఆలకించిన ఆదిదంపతులు, మాళ, మల్లేశ్వరులుగా అవతరించారని.. రాక్షసులను సంహరించారని భక్తులు నమ్ముతారు.
 
మాళ, మల్లేశ్వరులు మణి, మల్లాసుర రాక్షసులతో భీకరంగా పోరాడారు. నరుడి చేతిలో మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసులతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. చివరికి, శివుడి చేతిలో మరణించడం తమ అదృష్టంగా భావించిన రాక్షసులు, తమ చావుకు సిద్ధమయ్యారు. చనిపోయే ముందు, ప్రతి ఏటా తమకు నరబలి ఇవ్వాలని దేవదేవుడిని కోరారు. 
 
రాక్షసులు నరబలి కోరగా, దానికి బదులుగా ప్రతి విజయదశమికి గొరవయ్య తొడ రక్తాన్ని నైవేద్యంగా సమర్పించేలా దేవుడు అభయమిచ్చాడు. అప్పటి నుంచి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్ర జరుపుకుంటున్నారు.