ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ

ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ
గుండెకు పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ చేయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలోనే తన పనిని ప్రారంభించాలని భావిస్తున్నట్లు గురువారం తెలిపారు. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నేతలకు ఆయన ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. 83 ఏళ్ల మల్లికార్జున ఖర్గే మంగళవారం తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. దీనితో ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు ఆయనకు పేస్మేకర్ వేశారు.
శస్త్రచికిత్స చేసిన నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. మంగళవారం ఖర్గే ఆసుపత్రిలో చేరడంతో, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “మల్లికార్జున ఖర్గేతో నేను మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి విచారించాను. ఆయన త్వరగా కొలుకోవాలని కోరుకున్నాను. ఆయన శ్రేయస్సు, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నాను”అని ప్రధాని తెలిపారు.

ప్రస్తుతం జనరల్ వార్డులో విశ్రాంతి తీసుకుంటున్న ఖర్గేను సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లు పరామర్శించారు. అనంతరం ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిద్దరామయ్య తెలిపారు. మల్లికార్జున ఖర్గే తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు.

“శ్రీ ఖర్గేకి పేస్మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అక్టోబర్ 3 నుంచి ఆయన తన పనిని తిరిగి ప్రారంభించి, షెడ్యూల్ చేసిన అన్ని కార్యక్రమాలకు హాజరవ్వాలని అనుకుంటున్నారు. మీరు చూపిన ఆప్యాయతకు, ఇచ్చిన మద్దతుకు మా కృతజ్ఞతలు”అని ప్రియాంక ఖర్గే తెలిపారు.