పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి

పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలను పాకిస్తాన్‌ రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో పాక్‌ బలగాలు ఆందోళకారులపై కాల్పులు జరపగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ధిర్కోట్‌, ముజఫరాబాద్‌, బాఘ్‌, మిర్‌పుర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయని జాతీయ మీడియా వెల్లడించింది.

అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్నిరోజులుగా పీవోకేలో నిరసనలు జరుగుతున్నాయి. పీవోకే ప్రజల ప్రాథమిక హక్కులను పాకిస్తాన్‌ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.  పాక్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్‌ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. 

ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.  తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ప్రస్తుత నిరసనలు ప్లాన్‌-ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్రణాళికలు ఉన్నాయని ఏఏసీ లీడర్ షౌకత్‌ నవాజ్‌ మిర్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు పాక్ తమ భూభాగంలో భారీ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది.

బలోచిస్థాన్‌లోని సొంత ప్రజలపైనే శతఘ్నులు, మోర్టార్లతో దాడులు చేస్తోంది. దీనితో కుజ్దార్‌ జిల్లాలోని జెహ్రీ ప్రాంత ప్రజలు ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటున్నారు.  వాస్తవం చెప్పాలంటే, గత 4రోజులుగా పాక్ సైన్యం చేస్తున్న దాడులతో ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. వారికి కనీసం ఆహారం, ఇంధనం కూడా లభించడం లేదని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నారు. పాక్ సైన్యం చేస్తున్న వరుస బాంబు దాడులతో పత్తి పొలాలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని మీడియా పేర్కొంది.

ఛశ్మా ప్రాంతంలో శతఘ్నులు, మోర్టార్ల కారణంగా కొంత మంది పాక్ పౌరులు మరణించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పూర్తిస్థాయి సమాచారం తెలియడం లేదు. బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేస్తోంది. వాటి అధీనంలో ఉన్న జెహ్రీని తిరిగి స్వాధీనం చేసుకొనే లక్ష్యంతో పాక్‌ సేనలు ఈ దాడులు చేస్తోంది.