
రాంపల్లి మల్లిఖార్జునరావు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రారంభించి విజయదశమి నాటికి వందేళ్లు పూర్తయి, 101వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. ఈ 100సంవత్సరాల ప్రయాణం ఎట్లా సాగింది. సమగ్ర సమాజ ప్రవర్తనకు ఏ విధంగా కార్యప్రణాళిక రచన చేసింది? మొదలైన విషయాలు సూచనప్రాయంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. 1925లో ప్రారంభమైనా సంఘ్ పనిలో మౌలికమైన దైనందిన శాఖ 1926మే 25న ప్రారంభమైంది. 1929 వరకు సంఘ విస్తరణ ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యభారత్ లకు పరిమితం.
1929 నవంబర్ 9,10 నాడు నాగపూర్ లో జరిగిన సమావేశాలలో సంఘ నిర్మాత డాక్టర్జీ ని సంఘానికి సర్ సంఘచాలక్ గా ప్రకటించి సంఘానికి అఖిలభారత స్వరూపం ఇచ్చారు. 1929-40 మధ్య ఆ రోజుల్లో దేశంలో ఉన్న అన్ని ప్రావిన్సెస్ కు (ఇప్పట్టి ప్రాంతం)సంఘ్ పని విస్తరించింది. సంఘానికి 1940 సంఘ చరిత్రను మలుపు త్రిప్పిన సంవత్సరం. ఆ సంవత్సరం వారం రోజులపాటు జరిగిన సమావేశాలలో సంఘపనికి సంబంధిoచిన సమగ్ర రూపం, సంఘ ప్రార్ధన, సంఘ అజ్జలు, మొదలైనవన్నీ నిర్ణయించారు.
అదేసంవత్సరం నాగపూర్ లో జరిగిన తృతీయ వర్ష సంఘ్ శిక్షావర్గకు దేశం లోని అన్ని ప్రాంతాల నుండి శిక్షార్థులు పాల్గొన్నారు. ఆ శిక్షావర్గలో డాక్టర్ జి చివరి బౌధ్హిక్ జరిగింది. అదేసంవత్సరం డాక్టర్జీ జూన్ 3న ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టారు. డాక్టర్జీ సూచనా మేరకు గురూజీ గోల్వాల్కర్ ను సంఘానికి రెండవ సర్ సంఘచాలాక్ గా ప్రకటించారు. ఆ సంవత్సరమే గురూజీ పిలుపు మేరకు అనేకమంది ప్రచారక్ లు వచ్చారు.
వారు దేశమంతా సంఘ కార్య విస్తరణకు వెళ్లారు. అదేసమయంలో దేశ స్వాతంత్ర పోరాటం కీలక దశకు చేరుకొంటున్నది. ఆ పరిస్థితులు ఒక ప్రక్క సంఘానికి అనుకూలం, మరో ప్రక్క దేశం సమస్యల వలయంలో చిక్కుకొంటున్న సమయం. ఆ సమయంలో గురుజి మార్గదర్శనంలో సంఘం ఒక ప్రక్క విస్తరణ, మరో ప్రక్క నిలద్రొక్కుకోవటం ప్రారంభమైంది. 1940 నుండి 1973 మధ్యకాలంలో సంఘం దేశంలో అప్పుడున్న అన్ని జిల్లాలకు విస్తరించింది. అంతేకాదు సంఘ స్వయం సేవకులు వివిధ సామాజిక రంగాలలో పనులు ప్రారంభించారు. అక్కడనుండి సంఘ విస్తరణ ఒక క్రమ పధ్ధతి దేశంలోని తాలూకాలు, నగరాలలో వేగంగా పెరగసాగింది.
ఈ 100 సంవత్సరాల సంఘ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. అనేక ఆటంకాలు, ప్రతిఘటనల మధ్య ప్రయాణం సాగింది. సంఘంపై ప్రభుత్వాలు తమ రాజకీయాల లబ్ధికోసం మూడుసార్లు నిషేధం విధించాయి. ఆ నిషేధాలు, ఆటంకాలు, ప్రతిఘటనలను సంఘం తనకు అనుకూలంగా మలుచుకుని, ఆ ప్రతిఘటనలను అధిగమించి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది.
సంఘం ఈరోజు దేశమంతా విస్తరించింది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో హిందువులను సంఘటిత పరిచే పని అక్కడ కూడా చేస్తూ ఉన్నది. ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తున్నది. భగవాన్ శ్రీకృష్ణుని జీవితం మనం గమనించినట్లయితే శ్రీకృష్ణుని జననమే తనను తాను కాపాడుకునేందుకు ఒక సమస్యగా సాగింది. ఆ పరిస్థితులనుండి శ్రీకృష్ణుడు క్రమంగా ఎదుగుతూ ఒక నిర్ణయాత్మక శక్తిగా అవతరించి ధర్మ సంస్థాపన చేసాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు:
యదా యధా హ ధర్మస్య
గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య
తదాత్మానం సృజామ్యహం
అంటే అధర్మం పెచ్చు పెరిగినప్పుడు నాకు నేను సృజించుకుని సాకార రూపంలో అవతరిస్తూ ఉంటాను. అంటే ధర్మ సంరక్షణ అనేది ఈ దేశం యొక్క శక్తి రహస్యం. ధర్మ సంరక్షణ ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి జీవన లక్ష్యం. ధర్మ సంరక్షణ అంటే ఏమిటి? సమాజంలో వ్యక్తులు, కుటుంబాలు, వ్యవస్థలు ఉంటాయి. సమాజం ఏ మార్గంలో నడవాలి ఏ వ్యవహార శైలిలో ఉండాలో నేర్చుకోవాలి.
ప్రకృతి పరమేశ్వర స్వరూపం. ఈ సృష్టిని కాపాడుకోవాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని దాని అర్థం. ప్రకృతి వ్యక్తులు కుటుంబం వ్యవస్థలు సమాజం సంరక్షణ కోసం ధర్మాచరణ ముఖ్యము. ధర్మాచరణ అంటే మన కర్తవ్యాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం. దానికోసం ఈ దేశం ఎప్పుడైనా నిలబడుతుంది. ప్రపంచాన్ని ఈ సృష్టిని కాపాడుతుంది.ధర్మాచరణ గురించి కూడా భగవద్గీత ఇంకొక దగ్గర అని తెలిపింది:
శ్రేయాన్ స్వధర్మో నిగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్
స్వధర్మ నిధనం శ్రేయః
పర ధర్మో భయావహః
అంటే పర ధర్మంలో ఎన్ని సుగుణాలు ఉన్నను ఆ ధర్మం కంటే స్వధర్మాచరణే ఉత్తమం. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ ఈ లోకాన్ని విడిచి పెట్టడం శ్రేయస్కరం. . పరధర్మాచరణ భయావహ మైంది. అటువంటి స్వధర్మాన్ని ఆచరించేటువంటి పనిని ఈరోజు సంఘం రూపంలోమనకు కనబడుతుంది. సంఘ ప్రార్ధన లో” విధాయాస్య ధర్మస్య సంరక్షణం” అని చెబుతాం. ధర్మ సంరక్షణే సంఘ కార్యంఅంటే అది భగవంతుని కార్యం.ప్రార్ధనలో సంఘం చేస్తున్న పని పరమేశ్వర కార్యం అని కూడా చెప్పుకుంటాం.
సంఘం పనిలో మౌలిక అంశాలు
- ఇది మన మాతృభూమి
సంఘం ఈ దేశాన్ని మాతృభూమిగా భావిస్తూ పనిచేస్తున్నది ఈ భావన సంఘం ఏదో కొత్తగా కనిపెట్టిన విషయం కాదు, వేద కాలం నుండి మనకు ప్రేరణ శ్రోతస్సు ఈ భూమి నా తల్లి. అందుకే అధర్వణ వేదం లో ”మాతా భూమిహి పుత్రోహం పృథ్వ్యాః” అని చెప్పబడింది. ఈ భూమి నాతల్లి నేను ఆమె పుత్రుడను. అంటే ఈ సృష్టికి , ప్రకృతికి మనకు మధ్య విడదీయరాని సంబంధమే మాత పుత్ర సంబంధం. ఈ భావన కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచమంతా ఉండాలి అప్పుడే ఈ ప్రకృతి సృష్టి కాపాడబడుతుంది.
ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలనా సమయంలో ఈ దేశ సంరక్షణకు దేశం కోసం అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి ఒక ప్రేరణ మంత్రంగా వందేమాతర గీతం రచించబడింది ఈ వందేమాతర గీతం 1875 నవంబర్ 7న ఆవిష్కృతమైంది. ఈగీతాన్ని బంకించంద్ర చటర్జీ ఆవిష్కరించాడబంకించంద్ర చటర్జీ స్వాతంత్ర ఉద్యమ ప్రేరణకు ఈ తల్లిని” త్వం హి దుర్గా దశప్రహరణధారిణి కమలా కమల దళ విహారిణి వాణీ విద్యాదాయిని అని వర్ణించాడు”. వందేమాతరం ఈ దేశంలో ఒక రణ నినాదం అయింది. దాని అర్థం ఓ తల్లి నీకు నమస్కారం.
- మనం హిందువులం మన తల్లి భారతమాత
స్వామి వివేకానంద ఈ దేశంలో మనం ఎవరము? మన అందరి తల్లి ఎవరు? అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలందరికి ప్రేరణదాయకంగా చెప్పాడు. ”గర్వసే సే కహా హం హిందూ హై” అట్లాగే మన అందరి తల్లి భారతమాత అని చెప్పారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో సంఘం మనం హిందువులం మనం బంధువులం అనిచెబుతుంది. హిందూ సమాజ సంఘటన గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈ విషయాలను సంఘ ప్రార్థనలో మనకు కనబడతాయి.
ప్రార్థనలో ప్రారంభంలో నమస్తే సదా వత్సలే మాతృభూమే అని చెప్తాం. ఆ తదుపరి చరణంలో ప్రభో శక్తి మన్ హిందూ రాష్ట్రంగా భూత, అంటే మనమందరం ఈ హిందూ రాష్ట్రం యొక్క అవయవ స్వరూలం అని చెప్పుకుంటాం. ఆ తదుపరి విధాయాస్య ధర్మస్య సంరక్షణం, పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం అని చెప్పి చివరిలో భారత్ మాతాకీ జై అని చెప్పి ప్రార్థన ముగిస్తాము. సంఘం పని సిద్ధాంతమంతా ప్రార్థన లోనే ఉంది.
అందుకే ప్రార్థన మనకు భగవద్గీత లాంటిది. హిందూ సమాజ సంఘటనకు దైనందినశాఖా ప్రారంభించింది, ఆ శాఖను దేశమంతా విస్తరించింది. సంఘ పనికి కొలబద్ద శాఖా. శాఖా ద్వారా వ్యక్తి నినిర్మాణము చేస్తుంది. సంఘం చిన్న సమావేశాలద్వారా పనిచేస్తూ ఉంటుంది. సంఘం మౌలిక సూత్రం 1. సమగ్రంగా ఆలోచించటం, 2. సమన్వయంచేయటం 3. సంఘటనను నిర్మాణం చేయటం
- వ్యక్తి నిర్మాణం
సంఘంలో వ్యక్తి నిర్మాణం గురించి మాట్లాడుతూ ఉంటాం. వ్యక్తి నిర్మాణానికి మౌలిక ప్రేరణ ఏమిటి ? అసలు ఈ సృష్టి నియమం ఏమిటి? ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ఎట్లా ఉంటుందో మన శాస్త్రాలలో చెప్పబడింది ఆ విషయాలను ఒకసారి గమనిద్దాం:
నహి కశ్చిత్ క్షణమపి
జాతుతిష్టస్త్య కర్మకృత్
కార్యతే హ్యవసహ కర్మ
సర్వహ ప్రకృత్యిర్గుణః
అంటే ఈ సృష్టిలో ఏ ప్రాణి ఏ కాలంలో అయినా క్షణం మాత్రం కర్మను ఆచరించకుండా ఉండలేదు మనుషులు కూడా ప్రకృతిలో భాగం ప్రకృతిలో ఉండే గుణాలకు లోబడి కర్మలు చేస్తూనే ఉంటాం. అంటే ప్రతి వ్యక్తి కర్మను ఆచరించవలసింది అలాగే కర్మలు చేయటమే మన కర్తవ్యంవ్యక్తులుగా మనం మంచి పనులు చేయాలి. ధర్మ బద్ధంగా చేయాలి ధర్మ రక్షణకు చేయాలని చెప్పబడింది.
కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేశు కదాచన
మా కర్మఫల హేతుర్భు
మాతే సంగో కర్మణి
మీ కర్తవ్యాలను ఆచరించుటందే నీకు అధికారం ఉంది. ఫలితం నీకు హేతువు కారాదు, దానితో నీవు అశక్తుడు కావద్దు, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్య బుద్ధితో నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించాలి అని చెప్పబడింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయం సేవకులందరు హిందూ సమాజ సంఘటన కార్యంలో ప్రతి ఫలాపేక్ష లేకుండా దేశంకోసం పనిచేస్తూ ఉంటారు. అటువంటి కార్య కర్తలను సంఘం నిర్మాణం చేస్తూ ఉంటుంది. అందుకే సంఘంలో ప్రతి రోజు గంట అంతకంటే ఎక్కవ సమయం ఇచ్చి పనిచేసే లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి రోజు దేశంకోసం పనిచేసే స్వభావం సంఘం నిర్మాణం చేస్తున్నది.
దేశవ్యాప్తంగా శక్తి వంతమైన వ్యవస్థ నిర్మాణం
హిందూ సమాజము ఒక వ్యవస్థితమైన సమాజం. ఈ సమాజంలో సామాజిక ధార్మిక ఆర్థిక మొదలైన వ్యవస్థలు నిర్మాణమై ఉన్నాయి. వందల సంవత్సరాల నుండి హిందూ సమాజంలో సామాజిక వ్యవస్థలలో ఏర్పడిన లోటుపాట్లు అవ్యహారాలు సమాజాన్ని ఆత్మ రక్షణలో పడేసాయి . దానిలో అనేక అవ లక్షణాలు అ వ్యవహారాలు భాగమైపోయినయి. దానితో బలహీనమైనది. ఆ వ్యవస్థలను తిరిగి శక్తివంతం చేయవలసిన ఒక చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. దానిని సాధించటానికి ఒక ప్రయత్నం సంఘం చేస్తున్నది. సంఘం సమాజంలో మూడు రకాల వ్యవస్థలను నిర్మాణం చేస్తున్నది చివరకు ఈ వ్యవస్థ సమాజంలోని సామాజిక ధార్మిక వ్యవస్థలను పునరు జాగృతం చేయగలుగుతుంది.
సంఘంలో వ్యవస్థ అంటే?
- భౌగోళిక వ్యవస్థ భౌగోళికంగా సంఘం ఈరోజు దేశంలో శక్తివంతమైన వ్యవస్థను నిర్మాణం చేసింది. ఆ వ్యవస్థ ప్రస్తుతం పైనుంచి కిందికి విస్తరిస్తున్నది. రాబోయే రెండు మూడు దశాబ్దాలలో ఈ వ్యవస్థ ఆధారంగా చేయవలసిన పనులను క్రింది నుండి పైకి తీసుకుని వచ్చే పనిని ప్రారంభించింది. సంఘ పనిలో ఆ దృశ్యం ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.
అంటే సమాజంలో వ్యవస్థ నిర్మాణం పై నుండి క్రమంగా కిందికి రావాలి. పనులు క్రింది నుంచి పైకి జరగాలి. అదే సంఘం ఈరోజు సాధిస్తున్నది. సంఘ వ్యవస్థ అంటే 1. అఖిల భారత వ్యవస్థ, 2. క్షేత్రస్థాయి, 3. ప్రాంత స్థాయి, 4. విభాగ్ వ్యవస్థ, 5. జిల్లా స్థాయి, 6. ఖండ/నగర స్థాయి, 7. మండల/ బస్తిస్థాయి గా ఉంటుంది. ప్రతి 10,000 జనాభాకి ఒక పటిష్టమైన వ్యవస్థను కార్యకర్తల బృందాన్ని తయారుచేయటం ముఖ్యమైన పని.
సంఘ వ్యవస్థలో మూడు భాగాలు ఉన్నాయి. 1. ఇంతకు పూర్వం చెప్పిన సంఘ భౌగోళిక వ్యవస్థ, 2. సామాజిక అంటే వివిధ క్షేత్రాల వ్యవస్థ, 3. గతి విధి పనుల వ్యవస్థ అంటే సమాజంలో క్రింది స్థాయిలో చేయవలసిన పనులను సక్రియంగా ప్రభావంతంగా చేయించడం. దానితో పరంపరాగత సామాజిక వ్యవస్థలను పునర్ జాగృతం చేయాలి. దానికోసం ఏం చేయాలి?
ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో వికసించిన వ్యవస్థల నుండి మన పరంపరాగత వ్యవస్థల సంస్కరణ సక్రియంగా, సానుకూలంగా మార్చుకొని పని చేయటం. అందుకే సంఘం దేశమంతా పనిచేస్తూ అటువంటి వివిధ క్షేత్రాలను సుమారు 35 నిర్మాణం చేసింది. అంటే సామాజిక వ్యవస్థలను నిర్మాణం చేసింది. దీని అర్థం ప్రస్తుత సమాజ వ్యవస్థలో ఉన్న క్షేత్రాలు ఆధారంగా పరంపరాగ తమైన మన వ్యవస్థలను సక్రియం చేయటం దాని లక్ష్యం.
ఈ వ్యవస్థల నిర్మాణం పనిని 1948నుంచి సంఘం ప్రారంభించింది సంఘం. 1925లో ప్రారంభమైన సంఘం తన లక్ష్యసాధనకు ఎంచు కున్న మార్గం చేస్తున్న పని స్పష్టత 1950 నాటికి సంఘ వ్యవస్థలో ఉన్న వారి అందరికీ అర్థమైంది. దాని కారణంగా ఇదే పద్ధతిలో సంఘం ముందుకు పోతూ హిందూ సమాజ సంఘటన చేయవచ్చు, తమ లక్ష్యాన్ని సాధించవచ్చు అనే విశ్వాసం లో ఒక స్పష్టత వచ్చింది.
1950 నుంచి 2025 వరకు ఆ దిశలో ప్రణాళికాబద్ధంగా చేయవలసిన పనులన్నీ అంచలంచెలుగా వికసింప చేసుకుంటూ వస్తున్నది. ఆ పనులన్నీ చేసే వ్యవస్థ, పనులను సాధించేందుకు 2047 వరకు సంఘం సువ్యవస్థీతమవుతుంది అని ఒక స్థాయి. కార్యకర్తలకు ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోంది. అక్కడనుండి 20 లేదా 30 సంవత్సరాల కాల ఖండంలో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాం. పనులు చేస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు తో స్తబ్దత ఏర్పడుతుందేమోననే సందేహాలు అన్ని పటాపంచలమౌతూ మన మార్గం మన పని సరి అయినదే నని నిశ్చయం కార్యకర్తలలో కలుగుతున్నది.
గతి విధి పనులు
సంఘంలో 1925 నుంచి 1950 వరకు కార్యకర్తల నిర్మాణం వ్యవస్థను వికసింపజేసి పటిష్టం చేయటం ప్రాంత స్థాయిలో ఒక చక్కటి వ్యవస్థ నిర్మాణం చేసేందుకు ఉపయోగించారు. 1948 నుండి 1990 వరకు క్రమక్రమంగా అన్ని సామాజిక రంగాలలో ప్రవేశించి అక్కడ పని చేయటం ప్రారంభమైంది. ఆ వ్యవస్థలు ఈరోజు ఒక తిరుగులేని జాతీయ శక్తిరూపం సంతరించుకుని శక్తివంతంగా నిలబడ్డాయి. వాటి అనుభవాలు సమాజానికి కలిగించటం సమాజాన్ని ప్రభావితం చేయటం చేసుకుంటూ వస్తున్నది.
1990 నుండి 98 మధ్యలో సేవా సంపర్క ప్రచార విభాగాలు ప్రారంభమైనాయి. ఒక లక్షకు పైగా సేవ కార్యక్రమాలతో సమాజంలో పెద్ద పరివర్తన ఆత్మ నిర్భరత నిర్మాణం చేస్తున్నది. సంపర్క విభాగం ద్వారా సజ్జన శక్తి జాగరణ చేస్తూ వారిని సమాజ కార్యంలో భాగస్వామ్యులను చేస్తున్నది. ప్రచార విభాగం ద్వారా సంఘ ఆలోచనలను సామజిక మాధ్యమాల ద్వారా పెద్దఎత్తున అందరికి అందించే పనిచేస్తున్నది.
2000 నుండి క్రమంగా గతివిధి పనులు కూడా ప్రారంభమైనవి. అవి 1. గో సంరక్షణ గో సంవర్ధన, 2. గ్రామము- బస్తీ వికాసం, 3. ధర్మజాగరణ, 4. సామాజిక సమరసత, 5. కుటుంబ ప్రభోధన్, 6. పర్యావరణం. ఒక్కమాటలో చెప్పాలంటే సమాజంలో మనం చేయవలసిన పనులు ఇప్పటికే ప్రారంభించినట్టే. ఆ పనులను పూర్తిస్థాయిలో క్రిందికి తీసుకొని వెళ్లటమే ఇప్పటి యుగ అవసరం. అందుకే సంఘం శతజయంతి సమయంలో పంచ పరివర్తన పేరుతో ఆ పనులను సమాజంలో అందరికీ అర్థం చేయించేందుకు నిర్ణయించుకుంది. అట్లా గతి విధి పనుల నమూనాను సంఘం సమాజం ముందు పెట్టదల్చుకుంది.
ఉదాహరణకు 1. నాగపూర్ దగ్గరలో ఉన్న దేవులపాడులో గో సంరక్షణ గో సంవర్ధన ఒక పెద్ద ప్రయోగశాల. అది ఈరోజు దేశ విదేశాలకు ఒక ఆదర్శాన్ని అందిస్తున్నది. అనేకమంది అక్కడికి వెళ్లి అన్ని విషయాలను పరిశీలించి తమ దగ్గర కూడా ఆ పనులు చేయటం అనేది మనకు కనపడుతున్నది.
- గ్రామ వికాసం అంటే గ్రామాల పరివర్తనకు సంబంధించిన పనులను నానాజీ దేశముఖ్ మొట్టమొదట గొండా జిల్లాను ఎంపిక చేసుకుని పని చేశారు. అక్కడ చేసిన పనుల అన్నిటిని స్పష్టంగా సాకారం చేసుకోవడానికి చిత్రకూట్ కేంద్రంగా 500 గ్రామాలలో పనులను ప్రారంభించారు. చిత్రకూట్ లో ఒక గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని నిర్మాణం చేశారు. అక్కడ జరుగుతున్న పని మన దేశానికి ప్రపంచానికి ఒక నమూనా.
అందుకే అనేకమంది ప్రముఖులు ఆ విశ్వవిద్యాలయాన్ని అక్కడ జరుగుతున్న గ్రామ వికాసాన్ని సందర్శించారు అబ్దుల్ కలాం లాంటిదా ర్శనీకులు శాస్త్రవేత్తలు దానిని సందర్శించి సమగ్రంగా అవగాహన చేసుకున్నారు. ఆ విషయాలను ప్రజలకు కూడా తెలియజేశారు. అట్లాగే ధర్మ జాగరణకు రాజస్థాన్ గుజరాత్ మొదలైన ప్రాంతాలు పెద్ద ప్రయోగశాలలు, ఒక పెద్ద నమూనాలను నిర్మాణం చేశారు. మన దేశంలో మొట్టమొదట దయానంద సరస్వతి ప్రారంభించిన ఆర్య సమాజ్ ద్వారా మతం మారిన వాళ్లని పునరాగమున కార్యక్రమం చేయడం ప్రారంభించారు.
దయానంద శ్రద్ధానంద ఆ పనిని కొనసాగించారు. ఆ పనుల అన్నిటిని సమగ్రంగా ఈ రోజు ధర్మ జాగరణ ద్వారా పనిచేస్తుంది. రాజస్థాన్ లో పెద్ద ఎత్తున పరివర్తన తీసుకొచ్చింది ఇట్లా ఈ రోజున సంఘం అనేక నమూనాలను దేశ ప్రజల ముందు ఉంచింది.
(ముగింపు రేపు)
More Stories
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’