
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. అదేవిధంగా దేశంలోని టాప్ 10 కుబేర మహిళల జాబితాలో ఆమె అతి పిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించారు. ప్రముఖ సంస్థ ‘ఎం3ఎం హురున్ ఇండియా’ 2025 సంవత్సరానికిగాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో ఈ విషయం వెల్లడైంది. హురున్ ఇండియా నివేదిక ప్రకారం రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ ఏకంగా రూ.2.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు.
దాంతో ఆమె భారత మహిళా పారిశ్రామికవేత్తల్లో మొదటి స్థానంలో నిలిచారు. దేశంలోని టాప్ 10 అత్యంత ధనవంతుల జాబితాను పరిశీలిస్తే అందులో అతి తక్కువ వయస్కురాలిగా ఆమెనే ఉన్నారు. కాగా టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఆమె.. దేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
కాగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారి బిలియనీర్ల క్లబ్లో చేరారు. రూ.12,490 కోట్ల నెట్‌వర్త్‌తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ లిస్ట్‌లో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీనే టాప్‌లో ఉన్నారు. ముకేశ్ అంబానీ కుటుంబం భారత్‌లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. అంబానీ ఫ్యామిలీ రూ.9.55 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రూ.8.15 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇక ఈ జాబితాలో రోష్ణి నాదర్ మల్హోత్రా, ఆమె కుటుంబం తొలిసారి మూడో స్థానంలోకి వచ్చింది. రూ.2.84 లక్షల కోట్లతో ఆమె భారత్‌లో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. కాగా, భారత్‌లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోందని సదరు నివేదిక సూచిస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 350 దాటింది. 13 సంవత్సరాల క్రితం ఈ జాబితా ప్రారంభమైనప్పటి నుంచి బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఇక మొత్తం బిలియనీర్ల విలువ రూ.167 లక్షల కోట్లుగా ఉంది. ఇది భారత్ జీడీపీలో దాదాపు సగం.
దేశంలో యువ బిలియనీర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. తాజాగా పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్ల సంపదతో భారత్‌లోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు. భారత్‌లో బిలియనీర్ల సంఖ్యలో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. ముంబై నగరంలో దాదాపు 451 మంది సంపన్న వ్యక్తులు జీవిస్తున్నారు. ఆ తర్వాత న్యూఢిల్లీలో 223, బెంగళూరులో 116 మంది అత్యంత ధనవంతులు ఉన్నారు.
More Stories
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా
జనరల్ రైలు టికెట్‌కు ఆధార్ తప్పనిసరి