గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ

గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో పాటు దేశ ప్రజలు  నివాళులర్పించారు. గురువారం ఉదయం దిల్లీలోని రాజ్​ఘాట్​ను సందర్శించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ గాంధీజీ స్మారకం వద్ద అంజలి ఘటించారు.  అలాగే మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి గురువారమే కావాడం వల్ల ముర్ము, ప్రధాని మోదీ విజయ్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. 
గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రికి పలువురు రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. గాంధీజీ ఇచ్చిన శాంతి, సహనం, సత్యం అనే సందేశం మానవాళికి ప్రేరణ ఇస్తుందని అంతకుముందు దౌప్రది ముర్ము తెలిపారు. గాంధీ స్ఫూర్తితో సత్యాహింస మార్గాన్ని అనుసరిస్తూ దేశ సంక్షేమం, పురోగతికి కట్టుబడి ఉందామని పేర్కొన్నారు. పరిశుభ్రమైన, సాధికారత కలిగిన సుసంపన్న భారత్‌ను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్​లో ఆమె పోస్ట్ చేశారు.

“మన ప్రియమైన బాపూ అసాధారణ జీవితం, ఆయన ఆచరణలో చూపిన ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్నే మార్చాయి. ధైర్యం, నిరాడంబరతతో సమాజంలో మార్పు సాధించవచ్చని బాపూజీ నిరూపించారు. ప్రజలకు సేవ చేయడం, ఇతరులపై కరుణ చూపడం మన సాధికారికతకు శక్తిమంతమైన ఆయుధాలని ఆయన విశ్వసించారు” అని ప్రధాని మోదీ ఎక్స్​లో తెలిపారు.  “వికసిత్‌ భారత్‌ నిర్మాణ యాత్రలో బాపూజీ చూపిన మార్గాన్నే అనుసరిస్తూ ముందుకు సాగుతున్నామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు” అని మోదీ రాసుకొచ్చారు. 

భారతదేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా మోదీనివాళులర్పిస్తూ భారతదేశాన్ని బలోపేతం చేసిన సమగ్రత, వినయం, సంకల్పం గల అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రశంసించారు. ఆయన ఇచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం మన ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని రగిలించిందని మోదీ పేర్కొన్నారు. స్వదేశీ అనేది స్వావలంబన కలిగిన, అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది అని తెలిపారు.

సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి అత్యున్నత విలువల ద్వారా యావత్ ప్రపంచానికి మహాత్ముడు శాంతి మార్గాన్ని చూపించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆయన ఆదర్శాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సత్యం, అహింస, సామరస్యం అనే సూత్రాల ద్వారా భారత్ దేశాన్ని మహత్మ గాంధీ ఏకం చేశారని కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాపు ఆదర్శాలు, ద్వేషాన్ని ఎదుర్కొంటూ శాంతి, సోదరభావం, సత్యం, మానవత్వం అనే మార్గాన్ని అనుసరించడానికి మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఎక్స్​లో పోస్ట్ చేశారు.

అక్టోబర్​ 2న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినంగా జరపుకుంటారు. 2007లో ఐక్యరాజ్య సమితి తీర్మానానికి 140కిపైగా దేశాలు మద్దతులు తెలిపాయి. దేశంలో గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో నివాళులు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, ప్రజా ప్రచారాలు నిర్వహిస్తారు. ఇవన్నీ గాంధీజీ సిద్ధాంతాల ప్రాముఖ్యతను వెలుగులోకి తెస్తాయి. 

1869 అక్టోబర్‌ 2న జన్మించిన మహాత్మా గాంధీ, భారత స్వాతంత్ర్య పోరాటంలో అహింసా సిద్ధాంతంతో కీలక నాయకుడిగా నిలిచారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం (డాండీ మార్చ్), 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటిష్‌ పాలనకు సవాలు విసిరారు. ఆయనను దేశం జాతిపితగా స్మరించుకుంటుంది.