మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
విశ్వవిఖ్యాత విజ్ఞాన కేంద్రంగా వారణాసిలో బనారస్ విశ్వవిద్యాలయం నెలకొల్పిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మదనమోహన మాలవీయ ఆశయాల వ్యాప్తి కోసమై ఏర్పాటు చేసిన మహామనా మాలవీయ మిషన్ భాగ్యనగర్ శాఖ ఆధ్వర్యంలో అక్షయ ఫౌండేషన్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో పేద విద్యార్థులకు చెక్కల రూపంలో ఆర్థిక సహాయం అందించారు. 
 
మహామనాః శిక్ష సేవా ప్రకల్ప కార్యక్రమంలో భాగంగా మొత్తం 24 మంది విద్యార్థులకు రూ. 4.64 లక్షల ఆర్ధిక సహాయం అందించారు. గత రెండేళ్లలో ఆరవ పర్యాయం ఈ విధంగా ఆర్ధిక సహాయం అందించారు. ఇప్పటి వరకు మొత్తం 69 మంది విద్యార్థులకు రూ. 8.47 లక్షల మేరకు సహాయం అందించారు. పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, ఫీజుల నిమిత్తమై ఈ సహాయం అందిస్తున్నారు.
 
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్యెల్సీ ఎన్ రామచందర్ రావు ముఖ్యఅతిధిగా పాల్గొని చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాలవీయ మిషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. హైదరాబాద్ లో మదనమోహన మాలవీయ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
 
యల్లమ్మబండ వద్ద గల అక్షయ విద్య కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్, స్కిల్ ట్రైనింగ్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.  సమాజ అభ్యున్నతికి ఇలాటి సేవా కార్యక్రమాలు మరింత ప్రోత్సాహకరంగా నిలుస్తాయని రామచందర్ రావు కొనియాడారు. ఈ సందర్భంగా మదనమోహన మాలవీయ జీవిత చరిత్రను, ఆయన పోరాట ప్రతిభను వివరించే వీడియోను ప్రదర్శించి, ఆయన చిత్రపటంకు పుష్పాలతో అంజలి ఘటించారు.
 
హైదరాబాద్ లో మే, 2023 నుండి మహామన మాలవీయ మిషన్ కార్యక్రమాలు చేబడుతున్నామని ప్రధాన కార్యదర్శి, బనారస్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షుడు డా. బి. గోపాల్ రెడ్డి తెలిపారు. 53 మంది సభ్యులతో ప్రారంభమై ఇప్పుడు 123 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు.
 

గత ఫిబ్రవరిలో  దక్షిణ భారత బెనారస్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళణంను హైదరాబాద్ లో నిర్వహించామని, విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి, జమ్మూ కాశ్మీర్  లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యఅతిధిగా పాల్గొన్నారని తెలిపారు. తాటిబండ వద్ద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన సైన్స్ సెంటర్ కు మదనమోహన మాలవీయ పేరు పెట్టాలని కోరుతూ కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ఆ ప్రాంగణంలో మాలవీయ విగ్రహం ఏర్పాటు చేయాలని కూడా కోరామని తెలిపారు.

 
మహామన మాలవీయ మిషన్ హైదరాబాద్ బ్రాంచ్ అధ్యక్షులు పదాంచంద్ జైన్ అధ్యక్షత వహించారు. మిషన్ ప్రధాన పోషకులు డా. ఎం ప్రభాకరరావు తండ్రిగారైన ఎం వెంకట్రామయ్య మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. మిషన్ ఉపాధ్యక్షులు రంజిత్ రెడ్డి, సహాయ కార్యదర్శి-కోశాధికారి దివి రావు, కార్యవర్గ సభ్యుడు మేక కృష్ణారావు, అక్షయ్ విద్య కేంద్రం వ్యవస్థాపకుడు టి ప్రసాద్, గీత చౌదరి తదితరులు కూడా పాల్గొన్నారు.