బ్రిటిష్, నిజాంల చేతుల్లో నష్టపోయిన ఆర్ఎస్ఎస్

బ్రిటిష్, నిజాంల చేతుల్లో నష్టపోయిన ఆర్ఎస్ఎస్
* ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా స్మారక తపాలా బిళ్ల, నాణెం విడుదల
 
`దేశం ముందు’ అనే నమ్మకం కారణంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బ్రిటిష్, నిజాంల చేతుల్లో తీవ్రంగా నష్టపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో వ్యవస్థాపకుడు కె.బి. హెడ్గేవార్ సహా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులను జైలులో పెట్టారని కూడా ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది సందర్భంగా ప్రధాని ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళ, నాణెంలను బుధవారం విడుదల చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన నాణెం స్టాంపు దేశానికి ఆర్‌ఎస్‌ఎస్ చేసిన కృషిని తెలుపుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు.
 
“భారతదేశ చరిత్రలో భారతమాత చిత్రాన్ని నాణెంపై చెక్కడం ఇదే మొదటిసారి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నాణెంపై “రాష్ట్రే స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మామా” అనే ఆర్‌ఎస్‌ఎస్ నినాదం కూడా ఉందని చెబుతూ, దీని అర్థం “ప్రతిదీ దేశానికి అంకితం, ప్రతిదీ దేశానికే, ఏదీ నాది కాదు” అని తెలిపారు. వరద్ ముద్రలో సింహంపై కూర్చున్న భారతమాతకు స్వయం సేవకులు శిరస్సు వంచి నమస్సులు చేస్తుండటం రూ.100 కాయిన్‌పై ప్రింట్ చేశారని మోదీ పేర్కొన్నారు.
1963లో రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు నిర్వహించిన మార్చ్‌ ఫొటోతో ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవ స్మారక స్టాంపును రూపొందించడం ఆనందకర అంశమని ప్రధాని తెలిపారు.  ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “రేపు విజయదశమి, చెడుపై మంచి విజయం, అన్యాయంపై న్యాయం విజయం, అబద్ధాలపై సత్యం విజయం, చీకటిపై వెలుగు విజయానికి ప్రతీక… 100 సంవత్సరాల క్రితం దసరా నాడు ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన కేవలం యాదృచ్చికం కాదు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ పునరుత్థానం. సంఘ్ శతాబ్ది ఉత్సవాలను వీక్షించే అదృష్టం మనకు ఉంది” అని తెలిపారు.
 
ఆర్ఎస్ఎస్  మొదటి నుంచి దేశ నిర్మాణమనే ప్రధాన లక్ష్యంతోనే పనిచేస్తోందని ప్రధాని కొనియాడారు. తన లక్ష్యాన్ని సాధించే దిశగా ఆర్ఎస్ఎస్ దీర్ఘకాలంగా నిబద్ధతతో ముందుకు సాగుతుండటం చాలా గొప్ప విషయమని చెప్పారు. గత శతాబ్ద కాలంలో లెక్కలేనంత మంది జీవితాలకు దశను, దిశను చూపించి, వారిని బలోపేతం చేసిన ఘనత ఆర్ఎస్ఎస్‌దే అని ప్రధాని పేర్కొన్నారు.
 
నదీతీరాల్లో మానవ నాగరికతలు విలసిల్లిన విధంగానే, ఆర్ఎస్ఎస్‌లో సంగమించి, దాని ప్రవాహ స్రవంతిలో మమేకమై ఎంతో మంది వికసించారని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ఆత్మ అని, ఒకవేళ ఈ మూల సూత్రమే దెబ్బతింటే భారత్ బలహీనపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆర్ఎస్ఎస్ బలంగా నిలబడిందని, అలుపెరగకుండా దేశానికి సేవలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. 
 
సమాజంలోని విభిన్న వర్గాల అభ్యున్నతి కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని, దేశ నిర్మాణం అనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నందు వల్లే ఈ దిశగా పనిచేసే క్రమంలో ఎలాంటి వైరుధ్యాలూ రావడం లేదని ప్రధాని చెప్పారు. ఆర్ఎస్ఎస్ పరిధిలో ఎన్నో అనుబంధ సంస్థలు, సంఘాలు ఉన్నాయని, కేవలం ‘నేషన్ ఫస్ట్’ లక్ష్యం కోసమే అవన్నీ ఏకమై పనిచేస్తున్నాయని తెలిపారు.
‘ఒక భారత్, గొప్ప భారత్’ అనే అంశాన్ని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందని, అయినప్పటికీ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాతి కాలంలో ఈ సంస్థను జాతీయ స్థాయిలో కనిపించకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని తెలిపారు.  “ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్‌ పాద పద్మాలకు వినమ్రమైన మనస్సుతో నివాళులు అర్పిస్తున్నాను. ఆయనే మాకు రోల్ మోడల్. స్ఫూర్తి ప్రదాత. కేబీ హెడ్గేవార్‌ ఆరాధనీయుడు” అని తెలిపారు.