అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’

అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’

అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్థిక అనిశ్చితి, నిధుల లేమి కారణంగా అగ్రరాజ్యంలో బుధవారం షట్ ‌డౌన్ మొదలైంది. దీంతో 7.5 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఏడేళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలుకాగానే (భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్‌ ద్వారా ఆమోదించాలి. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 1న అమెరికా ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని నడపడానికి రిపబ్లికన్లు 15వ తాత్కాలిక నిధుల బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ఆరోగ్యబీమా, సబ్సిడీలను పొడగింపుంచాలని డెమోక్రాట్లు డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 21 వరకు ఖర్చు చేసే ప్రభుత్వ నిధులకు డెమోక్రాట్లు అడ్డుకోవడంతో నిధులు లేక ప్రభుత్వం షట్‌డౌన్‌కి దారితీసింది.

కాగా, ఈ చర్యతో రోజుకి 400 మిలియన్‌ డాలర్లు సంపాదిస్తున్న 75 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. కీలక రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా.. జీతం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఈ ప్రతిష్టంభనతో ఎయిర్‌ సర్వీసెస్‌, పబ్లిక్‌ మీడియా, ఆఓగ్య బీమా సబ్సిడీలు తీవ్రంగా ప్రభావితమవుతాయి, అలాగే ఫెడరల్‌ కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనలు సంస్థలు, దేశవ్యాప్తంగా సేవలపై తీవ్ర నష్టం పడనుంది. మరోవైపు ట్రంప్‌ షట్‌డౌన్‌ అమల్లోకి వస్తే ఉద్యోగాలు పోతాయి అని హెచ్చరించారు.

దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా సర్కారుకు మరో 7 వారాలకు సరిపడా నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుకు చుక్కెదురైంది. దాని అమలుపై అమెరికా సెనేట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. ఈ బిల్లు ఆమోదానికి సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా 60 ఓట్లు సాధించాలి. 

కానీ తాజాగా సెనేట్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ 55, విపక్ష డెమొక్రటిక్ పార్టీ 45 ఓట్లను సాధించాయి. ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటేనే, ట్రంప్ సర్కారుకు నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్లు ఆమోదానికి మార్గం సుగమం అవుతుంది. ఈ బిల్లులోని ప్రతిపాదనలపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా అది ఆమోదం పొందలేదు. పర్యవసానంగా అమెరికాలో షట్‌డౌన్ మొదలైంది.

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ కారణంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 7.50 లక్షల మంది కేంద్ర సర్కారు ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. రెండోసారి దేశ అధ్యక్షుడు కాగానే చాలామందిని ఉద్యోగాల నుంచి ట్రంప్ తొలగించారు. ఇప్పుడు మరింత మంది అమెరికన్ల ఉద్యోగాలకు గండం వచ్చి పడింది.  ఏయే ప్రభుత్వ విభాగాలకు ఎంతమంది సిబ్బంది అవసరం ? అవసరానికి మించి ఎంతమంది ఉన్నారు ? అనే లెక్కలను ట్రంప్ సర్కారు సేకరిస్తోంది. దీనిప్రకారం ఉద్యోగ కోతలు జరుగుతాయని అంటున్నారు. షట్ డౌన్ కారణంగా చాలా అమెరికా ప్రభుత్వ ఆఫీసులు మూతపడనున్నాయి. 

ఈ షట్‌డౌన్‌పై ట్రంప్ స్పందించారు. ‘ఈ షట్ డౌన్ ప్రభావంతో కొన్ని ఆఫీసులు శాశ్వతంగా మూతపడొచ్చు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు జరగొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే అన్ని అంశాలను తొలగిస్తాం’ అని ప్రకటించడం గమనార్హం. షట్‌డౌన్ వల్ల అమెరికాలోని విద్య, పర్యావరణం, వంటి పలు కీలకమైన సేవా విభాగాలపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. 

ఇక ఇదే సమయంలో దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి, స్వదేశాలకు పంపించే ప్రక్రియను సైతం ట్రంప్ సర్కారు వేగవంతం చేయనుంది. ప్రభుత్వానికి నిధుల కేటాయింపునకు విపక్ష డెమొక్రటిక్ పార్టీ సహకరించడం లేదని, ఈపరిస్థితుల్లో తన విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ అంటున్నారు. అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను, అవసరం లేని ప్రభుత్వ పథకాలను తొలగిస్తానని తేల్చి చెబుతున్నారు.