
త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు భావిస్తున్న తరుణంలో బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పూర్తి చేసిన ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ జాబితాపై వచ్చిన అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. బిహార్‌లో ప్రధాన ఎన్నికల అధికారి తన సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు.
ప్రజలు తమ పేర్లను voters.eci.gov.in లింక్‌పై క్లిక్ చేసి చూసుకోవచ్చని తెలిపారు. బిహార్ ఓటరు తుది జాబితా ప్రకటించడంతో వచ్చేవారం బిహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ చివరలో ఛట్ పండగ తర్వాత తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం.
బిహార్ ఎన్నికలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరగనున్న ఉప ఎన్నికల కోసం ఈసీ 470 మంది పరిశీలకుల్ని నియమించింది. వచ్చేనెల 3న సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకుల వివరాలపై ప్రకటన వెలువడుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత ఎలక్షన్ కమిషన్ బిహార్ ఓటర్ల జాబితాలో చాలా సవరణలు చేసింది.
పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగించింది. ముసాయిదా జాబితా ప్రకారం, ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు బిహార్‌లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉంటే, అందులో 65.63 లక్షల మంది ఓటర్లను తొలగించింది. వీరిలో మరణించిన, నకిలీ పత్రాలు సమర్పించిన వారు ఉన్నట్లు పేర్కొంది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల చిరునామాలను నవీకరించినట్లు తెలిపింది. ఎస్ఐఆర్ ప్రక్రియ కింద కొత్త ఓటర్ల పేర్లను కూడా ఓటరు లిస్ట్‌లో చేర్చినట్లు స్పష్టం చేసింది.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 మధ్య ఏకంగా 16.56 లక్షలకు పైగా యువత కొత్తగా ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం ఫారం-6ను సమర్పించారు. ఎన్నికల కమిషన్ అక్టోబర్ 4-5 తేదీల్లో బిహార్‌ను సందర్శించనుంది. దీని తర్వాత ఏ క్షణంలోనైనా బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. బిహార్ శాసనసభ పదవీకాలం 2025 నవంబర్ 22న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 246 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
More Stories
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ
ఇద్దరు ఉగ్రవాదులు, ముగ్గురు మావోయిస్టులు హతం
సరిహద్దుల్లో రక్షణకై రూ 30 వేల కోట్లతో మిస్సైల్ వ్యవస్థ