
ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాక్ ఇచ్చింది. ఆటగాళ్లకు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను (ఎన్‌వోసీలు) సస్పెండ్ చేసింది. దాంతో జాతీయ ఆటగాళ్లు ఇకపై ఏ విదేశీ టీ20 లీగ్, ఫ్రాంచైజీ తరఫున ఆడేందుకు అనుమతి ఉండదు. పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సయ్యద్ సమీర్ అహ్మద్ ఆటగాళ్లు విదేశీ లీగ్‌లకు బదులుగా దేశీయ క్రికెట్, అంతర్జాతీయ మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలని సూచించారు.
పీసీబీ నిర్ణయంతో పాకిస్తాన్ అగ్రశ్రేణి క్రికెటర్లను ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్ 15)లో బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్, షాదాబ్ ఖాన్ పాల్గొనాల్సి ఉంది. హరిస్ రౌఫ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఐఎల్ టీ20 లీగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఎన్‌వోసీలను సస్పెన్షన్‌కు కారణాలను పీబీసీ వెల్లడించలేదని, ఆసియా కప్‌లో జట్టు పేలవ ప్రదర్శనతో బోర్డు తక్షణ ప్రతిచర్యలు తీసుకున్నట్లుగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పాకిస్తాన్-భారత్ మధ్య జరిగిన ఆసియా కప్‌లో ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ వరుసగా రెండోసారి ఆసియా కప్‌ను నెగ్గింది. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత్ వరుసగా మూడుసార్లు పాకిస్తాన్‌ను ఓడించింది. ఆసియా కప్‌లో ఓటమి తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీతో సహా మితగా ఆటగాళ్లు లాహోర్‌కు చేరారు.
ఆసియా కప్‌లో ఓటమి తర్వాత పీసీబీ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. పీసీబీ నిర్ణయం డొమెస్టిక్ క్రికెట్, జాతీయ జట్టుకు ప్రాధాన్యతలో మార్పులను సూచిస్తుందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌లో ఫ్రాంచైజీ క్రికెట్ ఆటగాళ్లకు ఒక ప్రధాన అవకాశం. అయితే, ఆశ్చర్యకరంగా భారత్‌తో ఓటమి తర్వాత ప్రతిసారీ ఇలాంటి వార్తలు వెలుగులోకి రావడం ఆశ్చర్యకరంగా ఉంది.
అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ మౌలిక సదుపాయాల్లో ఎలాంటి మెరుగు కనిపించడం లేదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జట్టు పరిస్థితి దిగజారుతూనే ఉందని, పలుసార్లు పీసీబీ చైర్మన్, కొన్నిసార్లు కెప్టెన్, మరికొన్ని సార్లు కోచ్‌లను భర్తీ చేస్తారని, ఆటగాళ్లపై విశ్వాసం చూపించడానికి బదులుగా వేటు వేస్తారంటూ విమర్శలు వస్తున్నాయి.
అయితే, ఎన్‌వోసీలను రద్దు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు తిరుగుబాటు చేస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పాకిస్తాన్ ఆటగాళ్లు తిరుగుబాటు చేయడంతో పీసీబీ దిగివచ్చింది. సస్పెన్షన్ ముఖ్యంగా పరిమిత అవకాశాలున్న తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లను ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నారు.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’
లండన్ గాంధీ విగ్రహంపై అసభ్య రాతలపై భారత్ ఆగ్రహం
బలూచిస్థాన్ లో భారీ పేలుడు… 10 మంది మృతి