స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల కోసం బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు.  అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని చెబుతూ ముందుగా  ఏకగ్రీవంగా నిర్ణయమైన చోట వెంటనే బి-ఫాం ఇచ్చి ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.

వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెబుతూ అత్యధిక స్థానాలను సాధించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.
కరీంనగర్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే బిజెపి నాయకులు, పదాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఇంచార్జీలతో సమావేశం జరిపామని తెలిపారు.

ఆ తరువాత ఈరోజు జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు, జిల్లా నాయకులందరితో సమావేశమై, మూడు దశల్లో జరగబోయే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికను ఇప్పటి నుంచే పూర్తిచేయాలని సూచనలు ఇచ్చామని వెల్లడించారు. ఈ క్రమంలో ఈరోజు కరీంనగర్‌లో ఒక సమావేశం జరిగిన్నట్లు చెప్పారు.  బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రామచందర్ రావు విమర్శించారు.

బీఆర్‌ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని,  కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి లేకుండా వదిలేశారని ధ్వజమెత్తారు. ఆ కాలంలో అనేక సర్పంచులు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు పడి, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 12,500 పైచిలుకు గ్రామపంచాయతీలు ఉన్నాయని చెబుతూ ఈరోజు ఏ పంచాయతీకి వెళ్లినా మాజీ సర్పంచులు బిల్లులు రాక పడిన కష్టాలను చెబుతారని తెలిపారు. ఆ కాలంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులే నా దగ్గరకు వచ్చి “సార్, మా బిల్లులు రావట్లేదు” అని బాధపడ్డారని, గ్రామపంచాయతీ కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన విషయం తెలిసిందే అని పేర్కొంటూ బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల పనులు చేయనీయకుండా అడ్డుకుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కూడా ప్రజలకు, రైతులకు వాగ్దానాలు చేసింది కానీ నెరవేర్చలేకపోయిందని బిజెపి నేత విమర్శించారు. రైతులకు రైతు భరోసా కింద రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు కేవలం రూ. 6,000 మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. మూడు నెలలుగా 22 లక్షల రైతులకు కూడా డబ్బు రాలేదని చెప్పారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల అకౌంట్లో నిధులు జమ చేస్తోందని, ఉచితంగా బియ్యం అందిస్తోందని పేర్కొంటూ  గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని స్పష్టం చేశారు. రోడ్లు, నర్సరీలు, ఇంటింటికీ నీళ్లు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో జరుగుతున్నవే అని తెలిపారు.

కాబట్టి తెలంగాణ గ్రామీణాభివృద్ధి మళ్లీ సరైన దారిలో సాగాలంటే ఒక్క బిజెపి నే ప్రత్యామ్నాయం అని రామచందర్ రావు తేల్చి చెప్పారు.  బీఆర్‌ఎస్ దోపిడి చేసింది. కాంగ్రెస్ మోసం చేస్తోందని పేర్కొంటూ బిజెపి మాత్రం అభివృద్ధి అజెండాతోనే ముందుకు సాగుతుందని తేల్చి చెప్పారు.