ఢిల్లీలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన మోదీ

ఢిల్లీలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన మోదీ
ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో నూతనంగా నిర్మించిన ఢిల్లీ బిజెపి కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్, పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం దేశంలో సుపరిపాలన అందిస్తోందని, ‘అభివృద్ధి, వారసత్వం’ అనే మంత్రంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలకు సామాన్య ప్రజలకు చేరాలా చూడాలని పార్తీ కార్యకర్తలను ప్రధాని మోదీ కోరారు.  “బీజేపీ ప్రభుత్వం అధికారం కోసం కాదు, సేవ కోసం ఉంది. పార్టీ కార్యాలయాలు ఈ భావనను సజీవంగా ఉంచుతాయి. మన పార్టీ, మన  ప్రభుత్వం దేశం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తూ, దేశాన్ని మోసాల నుంచి, భారీ కుంభకోణాల నుంచి విముక్తి చేశాం” అని ప్రధాని మోదీ చెప్పారు.

దేశ రాజధానిని మినీ ఇండియాగా ప్రధాని మోదీ అభివర్ణించారు. అందుకే ఇక్కడి ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రతి పండుగలను జరుపుకోవాలని సూచించారు. ఢిల్లీతో బీజేపీ సంబంధాలు ప్రజల మనోభావాలు, నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని చెబుతూ జన్​సంఘ్ రోజుల నుంచి తమ పార్టీ ఢిల్లీ నగరం కోసం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ బీజేపీ కార్యాలయం పండిట్ పంత్ మార్గ్‌లో కొనసాగింది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉండటం ఈ భవనానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.  ఈ కొత్త కార్యాలయం నిర్మాణానికి రూ.2.23 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అధునాతన సదుపాయాలు, శాస్త్రీయ నిర్మాణ శైలి దీన్ని ప్రత్యేకంగా నిలిపాయి.  825 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కార్యాలయం ఐదు అంతస్తులతో రూపుదిద్దుకుంది. వాహనాల కోసం రెండు బేస్‌మెంట్ లెవెల్స్ ఏర్పాటు చేశారు. భవనం ఎకో-ఫ్రెండ్లీగా ఉండేలా, ఆధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఇది పార్టీ కార్యకలాపాలకు తగిన వాతావరణాన్ని కల్పిస్తుంది.

గ్రౌండ్ ఫ్లోర్‌లో కాన్ఫరెన్స్ రూమ్, రెసెప్షన్, కాంటిన్ ఉన్నాయి. 300 సీట్లు కలిగిన ఆధునిక ఆడిటోరియం కూడా ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో పార్టీ సెల్స్, సిబ్బందికి వసతి కల్పించారు. మూడో అంతస్తులో ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీల కోసం గదులు కేటాయించారు. టాప్ ఫ్లోర్‌ను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కోసం రిజర్వ్ చేశారు. రాష్ట్ర ఇన్‌చార్జ్ నేతలు, ఎంపీలకు ప్రత్యేక రూములు కేటాయించారు.