విజయ్ వ్యాన్ లో ఎక్కువ సేపు ఉండటంతోనే తొక్కిసలాట!

విజయ్ వ్యాన్ లో ఎక్కువ సేపు ఉండటంతోనే తొక్కిసలాట!
కరూర్‌లో తొక్కిసలాటకు నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ఉద్దేశపూర్వకంగా తన ప్రచార వాహనంలోనే ఎక్కువసేపు ఉండటం కారణమని పోలీసులు పేర్కొన్నారు. తమిళగ వెట్రి కజగం చీఫ్ ఎక్కువసేపు ఉండటం వల్ల శనివారం ఆయన ర్యాలీకి హాజరైన వారిలో రద్దీ, అశాంతి ఏర్పడిందని కేసులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు.

అందులో ‘విజయ్ ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ శక్తిని ప్రదర్శించారని, అందుకే కరూర్లో తొక్కిసలాట జరిగిందని’ పేర్కొన్నారు. “విజయ్ ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన ర్యాలీని 11 గంటలకు ప్రారంభించారు. వాస్తవానికి ఆయన కరూర్ ఏరియాకు సాయంత్రం 5 గంటలకు రావాల్సి ఉంది. కానీ రాత్రి 7 గంటలకు వచ్చారు. ఈ విధంగా ఆయన నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చారు” అని తెలిపారు. 

“తన రాజకీయ బలాన్ని చాటుకోవడానికి విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. మరోవైపు టీవీకే కేవలం 10 వేల మంది తమ సభకు వస్తారని పేర్కొంది. ఆ మేరకే పోలీసుల అనుమతి తీసుకుంది. కానీ ఆయన సభకు ఆలస్యంగా వచ్చి, ప్రజల్లో అనవసరమైన అంచనాలు పెంచారు. దీనితో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఇదే తొక్కిసలాటకు కారణం అయ్యింది” అని తమిళనాడు పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

“విజయ్ ప్రయాణిస్తున్న బస్సు షెడ్యూల్లోని అనేక స్టాప్ల వద్ద ఆగింది. నిజానికి ఇలా రోడ్షో చేయడానికి అనుమతి తీసుకోలేదు. నటుడు, పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్ బస్సీ ఆనంద్ సహా టీవీకే నాయకులు- జన సమూహానికి అందించాల్సిన ఆహారం, నీరు, సౌకర్యాల కొరత గురించి చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. విజయ్ వెళ్తున్న బస్సు ఒక ప్రణాళిక లేకుండా ఎక్కడబడితే అక్కడ ఆగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది” అంటూ అందులో పోలీసులు వివరించారు.

“మరోవైపు జనాలను నియంత్రించడానికి, తొక్కిసలాట లాంటి విపత్తులను నివారించడానికి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీవీకే కార్యకర్తలు తొలగించారు. విజయ్ను చూడడానికి చాలా మంది టిన్ పైకప్పుపైకి ఎక్కారు. అది కుప్పకూలడంతో చాలా మంది టీవీకే పార్టీకి సంబంధించిన వారు మరణించారు” అని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

ఇలా ఉండగా, టీవీకే అధినేత విజయ్‌ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడమే కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు విద్యుత్తు బోర్డు (టీఎన్ఈబీ) స్పందించింది. విజయ్‌ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతిపత్రం ఇచ్చిందని విద్యుత్తు బోర్డు చీఫ్‌ ఇంజినీర్‌ రాజ్యలక్ష్మి చెప్పారు. అయితే అందుకు తాము అంగీకరించలేదని వెల్లడించారు.

సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ, టీవీకే నుంచి తమకు లేఖ అందిందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అందులో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని విజయ్‌ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని కోరారని తెలిపారు.  కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించినట్లు రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు.

మరోవైపు తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టీవీకే ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని’ కోరారు.