‘కరూర్’ బాధితులను విజయ్ పరామర్శించరా?.. బిజెపి విస్మయం

‘కరూర్’ బాధితులను విజయ్ పరామర్శించరా?.. బిజెపి విస్మయం

కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలను టీవీకే అధినేత విజయ్ పరామర్శించకపోవడాన్ని తమిళనాడు బీజేపీ నేత వినోజ్ పి సెల్వం తప్పుపట్టారు. ఒక్క విజయ్ తప్ప అన్ని పార్టీల నేతలు రాత్రికి రాత్రి కరూర్‌కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారని ఆయన తెలిపారు. తొక్కిసలాట ఘటనలో గాయాలపాలైన, చనిపోయిన వారితో సంబంధమేం లేదు అన్నట్టుగా విజయ్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 

కరూర్‌లో తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ కారులో తిరుచ్చికి, విమానంలో చెన్నైకు, మళ్లీ కారులో పనైయ్యూర్‌కు వెళ్లారని వినోజ్ పి సెల్వం చెప్పారు. కరూర్‌లో ఏం జరిగిందో తెలియనట్టుగా విజయ్ మౌనంగా ఇంట్లో ఉంటున్నారని పేర్కొన్నారు. దీంతో విజయ్ జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. 

ఇలాంటి వ్యక్తిని తమిళనాడు యువత తమ నేతగా ఎలా స్వీకరిస్తుందని ఆయన ప్రశ్నించారు. విజయ్ లాంటి వ్యక్తిని నేతగా స్వీకరించడం సిగ్గుచేటు అంశమని ధ్వజమెత్తారు. కరూర్ బాధిత కుటుంబాలను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నైనర్ నాగేంద్రన్, తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, ఇతర నాయకులు పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి ఆమె భరోసా ఇచ్చారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తమిళిసై చెప్పారు. 

ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. దీనిపై సంచలనాల కోసం పాకులాడటం కంటే హేతుబద్ధంగా, వాస్తవిక కారణాల ప్రకారం స్పందిస్తే బాగుంటుందని ఆమె హితవు చెప్పారు. క్షతగాత్రులు కోలుకున్న తర్వాత, ఏం చేయాలనేది చూస్తామని పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే కరూర్‌లో తొక్కిసలాట జరిగిందని బీజేపీ నేత కే అన్నామలై ఆరోపించారు.

అదొక షాకింగ్ ఘటన అని, దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు, మహిళలు సహా దాదాపు 40 మంది చనిపోవడం బాధాకరమని చెప్పారు. ఎంతోమంది గాయాలతో చికిత్స పొందుతున్నారుని చెబుతూ రాజకీయ పార్టీ సభకు హాజరయ్యే జనం సంఖ్యను బట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం పోలీసుల బాధ్యతని అన్నామలై తెలిపారు. జనం సంఖ్యకు సరిపడే సభా వేదికకే పోలీసులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సభాస్థలిలో తగిన సంఖ్యలో పోలీసులను మోహరించాల్సి ఉండగా, అలా జరగలేదని విస్మయం వ్యక్తం చేశారు.

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో దేశంలో జనం రద్దీని నిర్వహించడంలో ఉన్న లోపాలు మరోసారి బయటపడ్డాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి పలు విషాదాలు జరిగాయని తెలిపారు. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన అందరికీ గుర్తుందని ఆయన పేర్కొన్నారు.  ఈ తరహా విషాదాల్లో ప్రజలు విలువైన ప్రాణాలను కోల్పోతుండటాన్ని చూస్తే చాలా బాధ కలుగుతుందని థరూర్ చెప్పారు. భారీ సంఖ్యలో జనం గుమిగూడే ప్రదేశాల్లో అమలు చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, నియమ నిబంధనలను రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు.

కాగా, ర్యాలీ జరుగుతుండగా కొందరు రాళ్లు రువ్వారని, ఆ వెంటనే పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారని, దాంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీవీకే కోర్టుకు తెలిపింది. ఆ గందరగోళ పరిస్థితుల్లోనే తొక్కిసలాట చోటుచేసుకుందని ఆరోపించింది. అందుకే ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నామని సోమవారం మద్రాస్‌ హైకోర్టులోని మధురై బెంచ్‌లో టీవీకే పిటిషన్‌ వేసింది.

ఘటనపై విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా సీబీఐకి అప్పగించాలని కోరామని టీవీకే న్యాయవాది అరివళగన్‌ ఓ వార్తా సంస్థకు చెప్పారు. ఘటనలో కుట్ర కోణం ఉందనేందుకు స్థానిక ప్రజల నుంచి తమకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. అందుకు సంబంధించి కొన్ని సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను పోలీస్ వర్గాలు ఖండిస్తున్నాయి. విజయ్ నిర్వహించిన ర్యాలీలో రాళ్లు రువ్విన సంఘటనలు జరగలేదని, కానీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకత్వం నిబంధనలను ఉల్లంఘించిందని తమిళనాడు ఏడీజీపీ డేవిడ్‌సన్ దేవాశిర్వతం స్పష్టం చేశారు. “రాళ్లు రువ్విన సంఘటన జరగలేదని మా దర్యాప్తులో తేలింది” అని చెప్పారు.

12,000 మందితో కూడిన సమావేశానికి నిర్వాహకులు అనుమతి కోరారని, పోలీసులు తగినంత సిబ్బందిని మోహరించారని దేవశిర్వతం తెలిపారు. అయితే, విజయ్ సాయంత్రం 6 గంటలకే వేదిక వద్దకు చేరుకున్నాడు, జనసమూహం వేగంగా పెరిగింది. తొక్కిసలాటకు దారితీసిందని తమిళనాడు ఉన్నతాధికారి తెలిపారు. “ స్వచ్ఛంద సేవకులు, బౌన్సర్లు, వారు ఎవరిని తీసుకువచ్చినా కూడా చాలా మంది యువకులు ఎవరి మాట వినడానికి కూడా ఇష్టపడలేదు” అని చెప్పారు. 

ఇలా ఉండగా, ఈ విషాద ఘటనపై విచారణ పూర్తయ్యే వరకూ విజయ్ నిర్వహించే ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. సామాజిక కార్యకర్త సెంథిల్ కన్నన్ సైతం ‘‘ప్రజా భద్రత ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) అనేది అసెంబ్లీ హక్కు (సమావేశాలు నిర్వహించే హక్కు) కంటే ముఖ్యమైనది అంటే ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటం అత్యవసరం. అందుకే టివికె పార్టీ భవిష్యత్తులో నిర్వహించే ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా నిరోధించాలి’’ అని కోర్టును కోరారు.