ఫిరాయింపు ఎమ్యెల్యేలపై స్పీకర్ విచారణ నేటి నుంచే

ఫిరాయింపు ఎమ్యెల్యేలపై స్పీకర్ విచారణ నేటి నుంచే
బీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కోనున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ కింద అనర్హత పిటిషన్లను విచారించనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్‌ విడుదల చేశారు. తొలిరోజు నలుగురు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోనున్నారు. 
 
రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని స్పీకర్‌ కార్యాలయం నోటీసులు పంపించింది. వీరు న్యాయవాదులతో కలిసి విచారణకు  హాజరవుతారు. వీరి మీద ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్‌ సైతం ట్రిబ్యునల్‌ ముందు హాజరు కానున్నారు.
శాసనసభ భవనాల ప్రాంగణంలో ప్రత్యక్ష విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. అక్టోబర్‌ 6వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ట్రిబ్యునల్‌ ముందు హాజరయ్యే పిటిషనర్లు, ప్రతివాదులు, వారికి సంబంధించిన న్యాయవాదులు కోర్టుహాల్‌లోకి మొబైల్‌ ఫోన్‌లను తీసుకురావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 
 
విచారణ కార్యకలాపాలను రికార్డ్‌ చేసినా, ఫొటోలు తీసినా ఫోన్లను జప్తుచేస్తామని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా శాసనసభ భవనాల ప్రాంగణంలోకి సందర్శకులను అనుమతించరు. శాసనసభ భవనాల ప్రాంగణంలోకి మీడియా సిబ్బందికి అనుమతి లేదు.  మీడియా పాయింట్ల వద్దగానీ, శాసనసభ భవనాల ప్రాంగణంలోగానీ ఫిర్యాదుదారులు, పిటిషనర్లు ప్రెస్‌ బ్రీఫింగ్‌ ఇవ్వడాన్ని కూడా నిషేధించారు.
ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను వారి శాసనసభ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతిస్తారు. మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలను శాసనసభ భవనాల ప్రాంగణంలోకి అనుమతించరు.