
వాణిజ్యం, ఇంధన సంబంధిత అంశాల్లో భారత్ తీసుకునే చర్యల్లో తాము జోక్యం చేసుకోబోమని, వాటిపై స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆ దేశానికి ఉంన్నదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని లవ్రోవ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక అజెండా ఉందని చెప్పారు.
వాణిజ్యం, సైనిక, సాంకేతికత, కృత్రిమ మేథ వంటి కీలక విషయాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని లవ్రోవ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య జరిగే సాధారణ దౌత్య చర్చల్లో భాగంగా ఈ ఏడాదిలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటించే అవకాశం ఉందని, తాను కూడా భారత్‌లో పర్యటిస్తానని తెలిపారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం లవ్రోవ్ భారత మీడియాతో మాట్లాడారు.
చమురు వాణిజ్య విధానాలపై భారత వైఖరిని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా చమురు కొనుగోళ్లపై ఇటీవల జైశంకర్ పేర్కొన్న విషయాలను లవ్రోవ్ ప్రస్తావించారు. అమెరికా తన చమురును అమ్మాలనుకుంటే దానికి సంబంధించిన నిబంధనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని జైశంకర్ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా యూఎస్‌తో కాకుండా రష్యా లేదా ఇతర దేశాలతో వాణిజ్యం కొనసాగించడం అనేది తమ సొంత విషయమని ఆయన చెప్పినట్లు వెల్లడించారు. కాగా, భారత్-రష్యా మధ్య ఉన్న ఆర్థిక భాగస్వామ్యానికి ఎలాంటి ముప్పు లేదని అంతకు ముందు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేసంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
“భారత్-రష్యా ఆర్థిక భాగస్వామ్యానికి ఎలాంటి ముప్పులో లేదు. భారత ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇప్పటికే స్పష్టంచేశారు. భారత్ తన భాగస్వాములను తానే ఎంచుకుంటుంది. అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి అమెరికాకు ఏవైనా ప్రతిపాదనలు ఉంటే, దిల్లీ వాటిపై చర్చించడానికి సిద్ధంగా ఉంది. అయితే వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక, సైనిక, సాంకేతికత, ఇతర సంబంధాల విషయమై భారత్ ఇతర దేశాలతో మాత్రమే చర్చిస్తుంది. ఆ దేశాలకే అది సంబంధించిన విషయం” అని సెర్గీ లావ్రోవ్ తెలిపారు.
భారత్ జాతీయ ప్రయోజనాల పట్ల రష్యాకు పూర్తి గౌరవం ఉందని సెర్గీ లావ్రోవ్ తెలిపారు. “ఆ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న విదేశాంగ విధానానికి గౌరవం ఇస్తున్నాం. మేం అత్యున్నత స్థాయిలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. భారత్, అమెరికా లేదా ఇతర దేశాల మధ్య తలెత్తే పరిస్థితులను, నేను రష్యా సంబంధాలకు ప్రమాణంగా పరిగణించను” అని తేల్చి చెప్పారు.
“మాకు చాలా కాలంగా ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఒక దశలో భారత మిత్రులు ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యంగా పేర్కొన్నారు. ఇటీవలే, ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎస్సీఓ సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. డిసెంబర్‌లో పుతిన్ దిల్లీ పర్యటన చేయనున్నారు” అని చెప్పారు. “మా ద్వైపాక్షిక అజెండా చాలా విస్తృతంగా ఉంది – వాణిజ్యం, సైనిక, సాంకేతిక సహకారం, ఆర్థిక, మానవతా విషయాలు, ఆరోగ్య రంగం, హై-టెక్, కృత్రిమ మేధస్సు. అంతర్జాతీయ స్థాయిలో ఎస్సీఓ, బ్రిక్స్ ద్వైపాక్షిక వేదికలపై కూడా మేం సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నాం” అని పేర్కొన్నారు.
అలాగే యుక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడానికి చర్చలకు సిద్ధంగా ఉందని సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఏదైనా చేసే ముందు రష్యా భద్రతా సమస్యలు, రష్యన్ మాట్లాడే ప్రజల హక్కులను పరిష్కరించాలని నొక్కి చెప్పారు. దీని ఆధారంగా, ఉక్రెయిన్‌కు భద్రతా హామీలను చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం