తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా భారత్

తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా భారత్

ఆసియా కప్ ఫైనల్లో అజేయ భారత్ జయభేరి మోగించింది. ఊహించిన దానికంటే ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో తిలక్ వర్మ (69 నాటౌట్)వీరోచిత పోరాటంతో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. 41 ఏళ్ల తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడిన టైటిల్ పోరు అసలైన క్రికెట్ మజాను అభిమానులకు అందించింది.  మునివేళ్లపై నిలబెడుతూ సాగిన పోరులో భారత్ బౌలర్లు విజృంభించారు. దీంతో కేవలం 146 పరుగులకే పాకిస్తాన్‌ కుప్పకూలింది.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 వికెట్లు కోల్పోయి కప్ కైవసం చేసుకుంది. తిలక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.  సంజూ శాంసన్ (24), శివం దూబే(33)లతో అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన తిలక్ రవుఫ్ వేసిన చివరి ఓవర్లో సిక్సర్‌తో విజయాన్ని ఖాయం చేశాడు. ఒకే రన్ అవసరంకాగా.. రింకూ సింగ్(4 నాటౌట్) బౌండరీ బాదడంతో తొమ్మిదోసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది.

లీగ్ దశ సూపర్ 4లో అలవోకగా నెగ్గిన టీమిండియాకు ఫైనల్లో పాకిస్థాన్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఛేదనలో టోర్నీ ఆసాంతం అదరగొట్టిన అభిషేక్ శర్మ(5) ఫైనల్లో ఉసూరుమనిపించాడు. పెద్ద షాట్లతో విరుచుకుపడాలనుకున్న అభిని పాక్ పేసర్ ఫహీం స్లో డెలివరీతో బోల్తాకొట్టించాడు. ఆ కాసేపటకే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(1) లాంగాఫ్‌లో షాట్‌కు యత్నించి సల్మాన్ అఘా చేతికి దొరికాడు.

దాంతో .2.3 ఓవర్లలో 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. సమోచితంగా ఆడాల్సిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్(5 నాటౌట్) సైతం ఫహీం ఓవర్లోనే రవుఫ్ చేతికి దొరికాడు.. అయినా సరే తిలక్ వర్మ (1నాటౌట్) ఒత్తిడిలోననూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ శాంసన్(24) ఔటయ్యాడు.  అబ్రార్ ఓవర్లో బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా సంజూ ఆడిన బంతిని ఫఖర్ చక్కగా అందుకున్నాడు. దాంతో 57 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది.

సంజూ శాంసన్‌(24)తో కలిసి 44 బంతుల్లో 50 రన్స్ జోడించాడు. అబ్రార్ ఓవర్లో తిలక్, ఆయూబ్ ఓవర్లో చెరొక సిక్సర్‌ బాదిన ఈ ఇద్దరూ జట్టు  స్కోర్ 70 దాటించారు. రన్‌రేటు పెరుగుతున్నందున పెద్ద షాట్‌కు యత్నించిన సంజూ వెనుదిరిగాడు.  ఇంకా విజయానికి 46 బంతుల్లో 70 రన్స్ కావాలి. రవుఫ్ వేసిన 15వ ఓవర్లో.. దూబే బౌండరీ బాదగా చివరి బంతిని తిలక్ స్టాండ్స్‌లోకి పంపగా జట్టు స్కోర్ వందకు చేరింది. రవుఫ్ వేసిన 18వ ఓవర్లో శివం దూబే(33) సిక్సర్‌తో సమీకరణం 12 బంతులకు 17 రన్స్‌గా మారింది.

ఫహీం మూడు బంతులకు మూడు రన్స్ రాగా.., నాలుగో బంతిని బౌండరీకి పంపాడు దూబే చివరి బంతికి ఔటయ్యాడు.  చివరి ఓవర్లో 10 రన్స్ అవసరమవ్వగా తిలక్ సిక్సర్‌తో జట్టును విజయానికి చేరువ చేశాడు. రింకూ సింగ్ బౌండరీ కొట్టడంతో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల విజయంతో విజేతగా నిలిచింది టీమిండియా. తొలుత టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. మరోసారి కుల్‌దీప్‌ యాదవ్‌ మాయాజాలం ముందు పాక్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు.

ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (57బీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫకార్‌ జమాన్‌ (46బీ 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో దాయాది జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, భారత స్పిన్నర్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి పాక్‌కు కళ్లెం వేశారు.  కుల్‌దీప్‌ యాదవ్‌ (4/30) విజృంభించాడు. అతను ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. దీంతో పాక్‌ 19.1 ఓవర్లలోనే 146 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, బుమ్రా తలో రెండేసి వికెట్లు తీశారు. 

పాకిస్థాన్‌ ఓపెనర్లు ఫర్హాన్‌, ఫకర్‌ జమాన్‌ పవర్‌ప్లేలో నిలకడగా ఆడి వికెట్‌ నష్టపోకుండా 45 పరుగులు చేశారు. కాస్త దూకుడుగా ఆడి అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఫర్హాన్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సైమ్‌ అయూబ్‌ (14) కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో 113 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే మహమ్మద్‌ హారిస్‌ కూడా పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్‌ ఫకర్‌జమాన్‌ కూడా వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక 17వ ఓవర్లో కుల్‌దీప్‌ విజృంభించాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి పాక్‌ను చావుదెబ్బ తీశాడు.