
మావోయిస్టులు ప్రతిపాదించిన ‘కాల్పుల విరమణ’ ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తిరస్కరించారు. మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టాలని స్పష్టం చేస్తూ మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టినట్లయితే భద్రతా దళాలు ఒక్క బుల్లెట్ కూడా కాల్చవని ఆయన హామీ ఇచ్చారు. ‘నక్సల్ రహిత భారత్’ పేరిట ఢిల్లీలో నిర్వహించిన భారత్ మంథన్ 2025 కార్యక్రమంలో మాట్లాడుతూ అయితే భారత్లో నక్సలిజం కేవలం ఆయుధాలతోనే అంతం కాదని, ఇందుకోసం నక్సలిజం వెనుక ఉన్న సిద్ధాంతాలపై పోరాటం చేయాలని పిలుపిచ్చారు.
“ఇటీవల, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి, ఇప్పటివరకు జరిగింది పొరపాటు అని, కాల్పుల విరమణ ప్రకటించాలని, మేము లొంగిపోవాలనుకుంటున్నామని పేర్కొంటూ ఒక లేఖ వచ్చింది,” అని చెబుతూ “మీరు లొంగిపోవాలనుకుంటే, కాల్పుల విరమణ అవసరం లేదు. మీ ఆయుధాలను కింద పెట్టండి. పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా కాల్చరు” అని తేల్చి చెప్పారు.
మావోయిస్టుల ‘కాల్పుల విరమణ’ ప్రతిపాదనను స్వాగతించిన వారిని కూడా కేంద్ర హోంమంత్రి విమర్శిస్తూ వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌ను ఆపాలని వామపక్షాలు, ముఖ్యంగా సీపీఐ, సీపీఐ-ఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని ఆయన పేర్కొన్నారు.
“వారిని ఎందుకు రక్షించాలి? బాధిత గిరిజనుల మానవ హక్కులను కాపాడటానికి ఎన్జీఓలు ఎందుకు ముందుకు రావు? ఈ సుదీర్ఘ కథనాలను వ్రాసి మాకు సలహా ఇచ్చే వారందరూ ఎప్పుడైనా గిరిజన బాధితుల కోసం ఒక వ్యాసం రాశారా? వారు దీని గురించి ఎందుకు ఆందోళన చెందడం లేదు?” అని అమిత్ షా ప్రశ్నించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2026 మార్చి 31 నాటికి భారత్లో పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తామని పునరుద్ఘాటించారు.
“మాకు వారిని చంపాలనే ఉద్దేశం లేదు. దాదాపు 290 మందికిపైగా ఆయుధాలు పట్టిన వారు హతమయ్యారు. ఇంకా 1,090 మంది అరెస్ట్ అయ్యారు. ఎక్కడైనా అరెస్ట్ చేసే అవకాశం వస్తే తప్పకుండా వారిని అదుపులోకి తీసుకుంటాం. ప్రభుత్వ విధానాలతో 881 మంది లొంగిపోయారు. నక్సలైట్లు లొంగుబాటు లేదా అరెస్ట్ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది” అని తెలిపారు.
“వారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పాం. ఇందుకోసమే నక్సలైట్ల కోసం అద్భుతమైన లొంగుబాటు విధానాన్ని తీసుకువచ్చాం. అయినా సరే ఆయుధాలు తీసుకుని అమాయకులైన పౌరులను చంపుతుంటే భద్రతా దళాలకు మరో ఆప్షన్ ఉండదు. బుల్లెట్లకు బుల్లెట్లతోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.” అని అమిత్ షా స్పష్టం చేశారు.
More Stories
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
బ్రిటిష్, నిజాంల చేతుల్లో నష్టపోయిన ఆర్ఎస్ఎస్
‘శుక్రాచార్య’గా అక్షయ్ ఖన్నా