
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వీసాను అమెరికా రద్దు చేసింది. పెట్రో నిర్లక్ష్య వైఖరి, రెచ్చగొట్టే చర్యల కారణంగా వీసాను రద్దు చేస్తున్నామని శనివారం ఆ దేశ విదేశాంగ శాఖ సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లి సమావేశాల నిమిత్తం న్యూయార్క్ వచ్చిన పెట్రో ఐరాస కార్యాలయం వద్ద జరుగుతున్న పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
అనంతరం ఐరాస సమావేశంలో మాట్లాడుతూ అనేక దేశాలు పాలస్తీనాను గుర్తించినా ట్రంప్ గుర్తించలేదని, గాజా మారణహోమంలో అమెరికా భాగస్వామి అని విమర్శించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో కరేబియన్ సముద్ర జలాల్లో అమాయకులైన, సంబంధంలేని వారిపై క్షిపణి దాడులు చేస్తుందని విమర్శించారు. ఈ దాడులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెట్రో ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అమెరికా ఆయన వీసాను రద్దు చేయడం గమనార్హం. అమెరికాకు కొలంబియా ప్రదాన వాణిజ్య భాగస్వామి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేక చర్యలకు మద్దతిచ్చిన మిత్ర దేశం అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత స్వరం మారింది. కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడైన పెట్రో అమెరికా వలస విధానాన్ని వ్యతిరేకించారు.
తమ దేశ పౌరులను బలవంతంగా సైనిక విమానాల్లో నేరస్తుల్లా తరలించడాన్ని ఖండించారు. సుంకాల బెదిరింపులకు లొంగిపోకుండా తిరిగి అధిక సుంకాలను విధించారు. వీసాల రద్దు విషయంలో అమెరికా తీరును పలువురు విమర్శిస్తున్నారు. పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ వీసాను అమెరికా రద్దుచేయడంతో ఐరాస సమావేశంలో ఆయన ఆన్‌లైన్‌లో ప్రసంగించాల్సి వచ్చింది.
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సనారో అవినీతిపై తీర్పు వెల్లడించిన కోర్టు జడ్జి వీసాను కూడా రద్దు చేసింది. అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసం వీసా రద్దును ఉపయోగించుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’
లండన్ గాంధీ విగ్రహంపై అసభ్య రాతలపై భారత్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెటర్లకు విదేశీ లీగ్‌లో ఆడకుండా ఆంక్షలు