నిస్వార్ధం, క్రమశిక్షణలే ఆర్ఎస్ఎస్ నిజమైన బలాలు

నిస్వార్ధం, క్రమశిక్షణలే ఆర్ఎస్ఎస్ నిజమైన బలాలు
 
నిస్వార్థ సేవా స్ఫూర్తి, క్రమశిక్షణలే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిజమైన బలాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ప్రతీ పనిలోనూ ‘నేషన్ ఫస్ట్’కే ప్రాధాన్యత ఇస్తారని కొనియాడారు. 100వ వ్యవస్థాపక దినోత్సవాలను ఆర్ఎస్ఎస్ ఘనంగా నిర్వహించుకుంటున్న వేళ ఆదివారం రోజు 126వ ‘మన్ కీ బాత్’లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
“ఇంకొన్ని రోజుల్లో మనం విజయదశమిని జరుపుకోబోతున్నాం. ఓ కారణం వల్ల ఈసారి విజయదశమి చాలా ప్రత్యేకంగా నిలువనుంది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం విజయదశమి పండుగ రోజునే ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. ఈ విజయదశమి రోజునే ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవం కూడా జరగనుంది. ఆ సంస్థ వందేళ్ల ప్రస్థానం అపూర్వమైంది మాత్రమే కాదు, స్ఫూర్తిదాయకమైంది కూడా” అని చెప్పారు. 
 
“వందేళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ ఏర్పాటైన సమయానికి మన దేశం బానిస సంకెళ్లలో ఉంది. శతాబ్దాల తరబడి బానిస సంకెళ్లలో బందీ అయినందు వల్ల భారతీయుల ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవాలకు మానిపోని గాయమైంది. దేశ ప్రజల్లో ఆత్మన్యూనతా భావం ఏర్పడింది. అందుకే దేశానికి స్వాతంత్య్రం ఎంత ముఖ్యమో, సైద్ధాంతిక బానిసత్వం నుంచి స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం” అని భావించినట్లు తెలిపారు.

వికసిత్‌ భారత్ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం స్వదేశీ తయారీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని ప్రధాని కోరారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్వదేశీ ఉత్పత్తులపై మహాత్మా గాంధీ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారని గుర్తు చేశారు.

కాలక్రమంలో ఖాదీకి ప్రజాదరణ క్షీణించినప్పటికీ గత 11 ఏళ్లుగా మళ్లీ పెరుగుతోందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను, అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో మిగతా దేశాల మాదిరిగానే మనం కూడా సొంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి దీనిపై దేశవ్యాప్త విప్లవానికి నడుం బిగించాలని కోరారు.
 
“రానున్న రోజుల్లో వరుసగా పండుగలు ఉన్నాయి. ప్రతి పండుగకి మనం వస్తువులను కొనుగోలు చేస్తాం. ఈసారి జీఎస్టీ ఆదా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఒక బలమైన సంకల్పంతో పండుగలను మరింత ప్రత్యేకంగా మార్చొచ్చు. ఈ దఫా పండుగలను స్వదేశీ ఉత్పత్తులతోనే జరుపుకుంటామని నిర్ణయించుకుంటే, పండుగ తాలుకా సంతోషం మరింత రెట్టింపు అవుతుంది” అని మోదీ స్పష్టం చేశారు. 
 
“షాపింగ్ చేసే సమయంలో ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోవాలి. దేశంలో తయారైన వస్తువులనే కొనండి. చేనేత, హస్తకళాకారులు రూపొందించిన ఉత్పత్తులనే ఇంటికి తీసుకెళ్లండి. భారత పౌరులు కష్టపడి తయారు చేసిన వస్తువులనే వినియోగించండి. వీటిని పాటించడం ద్వారా మనం కేవలం వస్తువులను మాత్రమే ఇంటికి తీసుకెళ్లడం లేదు. ఒక విశ్వాసాన్ని తీసుకెళుతున్నాం. ఆత్మ నిర్బర భారత్ సాకారం కావాలంటే అందుకు స్వదేశీ ఒక్కటే మార్గం” అని తెలిపారు.

“మన పండుగలే మన సంస్కృతిని కలకాలం సజీవంగా ఉంచుతాయి. ‘ఛట్ పూజ’ సందర్భంగా మనం అస్తమిస్తున్న సూర్యుడిని పూజలతో గౌరవిస్తాం. ‘యునెస్కో అపూర్వ సాంస్కృతిక వారసత్వ జాబితా’లో ‘ఛట్ పూజ’ను చేర్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చేరిక జరిగితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఈ పండుగ ప్రాధాన్యం గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. అంతర్జాతీయ పండుగగా ‘ఛట్ పూజ’ మారుతుంది. కొంతకాలం క్రితం మా ప్రభుత్వం చొరవ వల్లే కోల్‌కతా దుర్గాపూజను యునెస్కో జాబితాలో చేర్చారు” అని మోదీ తెలిపారు.
 
“అమర్ షహీద్ భగత్ సింగ్ ప్రతీ భారతీయుడికి స్ఫూర్తిప్రదాత. ప్రత్యేకించి దేశ యువతకు ఆయనంటే చాలా ఇష్టం. భగత్ సింగ్ జయంతిని(సెప్టెంబరు 27) పురస్కరించుకొని దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను మనమంతా గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రఖ్యాత గాయకురాలు దివంగత లతా మంగేష్కర్ ఆలపించిన దేశభక్తి గీతాలు నేటికీ అందరికీ గుర్తున్నాయి. ఆదివారం రోజున ఆమె జయంతి జరుగుతోంది. భగత్ సింగ్, లతా మంగేష్కర్‌లకు నా నివాళులు” అని ప్రధాని చెప్పారు.

లతా మంగేష్కర్ పాడిన దేశభక్తి గీతాలను ప్రధాని మోదీ కొనియాడిన తర్వాత, ఆమె ఆలపించిన ‘జ్యోతి కలశ్ ఛల్కే’ పాటను ప్లే చేశారు. ఇక ఈ ప్రసారం సందర్భంగా మహిళా నేవీ అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపలతో ప్రధాని మోదీ సంభాషించారు. ‘ఐఎన్ఎస్‌వీ తరిణి’ అనే బోటులో సాహసోపేతంగా, ఎంతో పట్టుదలతో నావికా సాగర్ పరిక్రమను నిర్వహించినందుకు వారిద్దరిని ఆయన అభినందించారు.