బ్రిక్స్‌లో సభ్యత్వం కోరిన పాలస్తీనా

బ్రిక్స్‌లో సభ్యత్వం కోరిన పాలస్తీనా
బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం పాలస్తీనా దరఖాస్తు చేసుకుంది. ఇటీవలి వారాల్లో పలు దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పాలస్తీనా దౌత్యవేత్త ఒకరు తెలిపారు. ఇంకా తమ దరఖాస్తుకు ఎలాంటి స్పందన రాలేదని రష్యాలో పాలస్తీనా రాయబారి అబ్దుల్‌ హఫీజ్‌ నోఫల్‌ రష్యా మీడియా సంస్థలకు తెలిపారు. 
 
పాలస్తీనా ప్రస్తుతం కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటోందని, పూర్తిస్థాయి సభ్యురాలిగా మారేందుకు పరిస్థితులు అనుమతించేవరకు అతిథి దేశంగా బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గనాలని పాలస్తీనా భావిస్తోందని చెప్పారు. తొలుత బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన బ్రిక్స్‌ను గతేడాది విస్తరించారు. ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లను చేర్చారు. ఈ ఏడాది ఇండోనేషియా చేరుతోంది.
 
పాలస్తీనా రాయబారి వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గుయో జియాకున్‌ స్పందిస్తూ, బ్రిక్స్‌లో చేరేందుకు భావ సారూప్య పక్షాలను మరిన్నింటిని చైనా స్వాగతిస్తుందని చెప్పారు. కొత్తగా ఆవిర్భవించే మార్కెట్లు, వర్థమాన దేశాల మధ్య సహకారానికి కీలకమైన వేదికగా బ్రిక్స్‌ వుంది. బహుళ ధృవ వ్యవస్థకు బలమైన ప్రేరణనిస్తుంది. అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానిస్తుందని గుయో చెప్పారు.
 
ఈ వారంలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా పలు దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. వాటిల్లో కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్‌ కూడా వున్నాయి. అంతర్జాతీయంగా పేద, వర్థమాన దేశాలు ఈ వేదికను విస్తృతంగా గుర్తించాయి. బ్రిక్స్‌ సహకార వ్యవస్థలో మరిన్ని భావ సారూప్యత కలిగిన పక్షాలు చేతులు కలపాల్సి వుంది. మరింత న్యాయమైన, సమతుల్యతతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ కోసం సంయుక్తంగా కృషి చేయాల్సి వుందని గుయో చెప్పారు.