ఇథనాల్ కోసం అమెరికా నుండి మొక్కజొన్న కొనుగోలు!

ఇథనాల్ కోసం అమెరికా నుండి మొక్కజొన్న కొనుగోలు!
భారత్- అమెరికాల మధ్య వాణజ్య ఒప్పందం ఖరారు కావడంతో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుండి దిగుమతి చేసుకొనే విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా అమెరికా నుండి ఇథనాల్ ఉత్పత్తి కోసం భారత్ మొక్కజొన్నను కొనుగోలు అంశంపై రెండు దేశాలు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై స్పష్టత వస్తే వాణిజ్య ఒప్పందంలో చర్చలు సానుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
 
వాణిజ్య ఒప్పందం కుదరకపోయినా, ఈ కొత్త ప్రతిపాదన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) పంటల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే విషయంలో భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనల మధ్య ఒక కీలక అడుగుగా పరిగణించబడుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక సుంకాలు విధించిన తర్వాత, రెండు దేశాల మధ్య ఒక రౌండ్ వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి, అయితే అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తి కోసం మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అమెరికా తమ సోయాబీన్స్, మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని భారత్‌పై ఒత్తిడి చేస్తోంది. 

అయితే, జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) రకాల గురించి ఆందోళనలను ఉటంకిస్తూ భారత ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. భారతీయ రైతులను రక్షించడానికి, జీఎం ఉత్పత్తులు ఆహార గొలుసులోకి రాకుండా నిరోధించడానికి భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మార్కెట్ యాక్సెస్ పరిమితులపై స్థిరంగా ఉంది.

కాగా, చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, శీతాకాల కాలంలో తదుపరి రౌండ్ చర్చల తేదీ, స్థానం ఇంకా నిర్ణయించబడనప్పటికీ, వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జరుపుతున్న పర్యటన ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.