
* విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతిలలో ప్రచార కేంద్రాలు
ఆంధ్ర ప్రదేశ్ లో యోగ ప్రచార పరిషత్ (ఏపీవైపీపీ) ఏర్పాటుకాబోతుంది యోగా, ప్రకృతి వైద్యం, పరిశోధనలు ప్రోత్సహించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. దీని ఏర్పాటుకు సుమారు రూ. 10 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు పరిషత్ ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి కేంద్రాలుగా ప్రచార కేంద్రాలు ఏర్పాటవుతాయి.
పరిషత్ చైర్మన్ గా వైద్యారోగ్య శాఖా మంత్రి వ్యవహరిస్తారు. ఇందులో పలువురు నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. యోగా, ప్రకృతి వైద్యం, ప్రజారోగ్యం రంగాలకు చెందిన నిపుణులతో విడిగా ప్యానళ్ల కమిటీలు ఏర్పాటవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లోని యోగాధ్యయన పరిషత్ ను ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని పదో షెడ్యూలులో చేర్చారు.
పర్యవసానంగా, భౌగోళికంగా హైదరాబాదులో ఉన్న 4 యూనిట్లు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లాయి. దీంతో రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యం, పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు యూనిట్లు లేవు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు-2025 రాష్ట్రంలో విజయవంతంగా జరిగాయి. యోగాంధ్ర-2025 ప్రచార సమీక్ష సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రకృతి వైద్యం, యోగా ప్రయోజనాలు, పాఠశాల విద్యలో యోగాను సిలబస్ గా ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా యోగా పరిషత్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.
ఈ మేరకు ఆయుష్ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విపులంగా చర్చించారు. అనంతరం పరిషత్ ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు ఎలా ఉండాలన్న దానిపై ఆయుష్ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. వార్షిక వ్యయం కింద రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. సుమారు 70 మంది వరకు సిబ్బంది. నిపుణులు అవసరమవుతారని అంచనా.
సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద పరిషత్ ఏర్పాటవుతుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి అదనంగా గ్రాంట్లు పొందే వీలుంది. ఈ పరిషత్ ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణులు, అభ్యాసకులకు యోగా, ప్రకృతి వైద్యంపై శిక్షణ తరగతులు, పరిశోధలు జరుగుతాయి. రాష్ట్ర ప్రజల్లో యోగా, ప్రకృతి వైద్యం ప్రాధాన్యతపై అవగాహన పెంచడమే ధ్యేయంగా పరిషత్ కార్యకలాపాలుంటాయి.
ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో 26 జిల్లాలకు కలిపి విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి లలో అధ్యయన, ప్రచార కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. విశాఖపట్నం ప్రచార కేంద్రం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలున్నాయి.
విజయవాడ కేంద్రం పరిధిలో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలున్నాయి. ఒంగోలు కేంద్రం పరిధిలో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలున్నాయి. తిరుపతి కేంద్రం పరిధిలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలున్నాయి.
More Stories
పాకిస్థాన్ ప్రధాని డ్రామాలను ఐరాస మరోసారి చూసింది
`సోషల్ మీడియా’ కేసుపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
అమెరికా సుంకాలపై నాటో వాదనల పట్ల భారత్ మండిపాటు