
హైదరాబాద్‌లో గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా భారీ వరద మూసీని ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వరద రావటంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి.
మూసీ ఉధృతికి ఎమ్‌జీబీఎస్ బస్టాండ్ వరద నీటిలో చిక్కుకుపోయింది. అధికారులు బస్టాండ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. పూర్తిగా బస్టాండ్‌ను ఖాళీ చేయించారు. బయటినుంచే రాకపోకలు సాగుతున్నాయి. రాత్రి ఒక్కసారిగా వరద రావటంతో మూసానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. జనం కట్టుబట్టలతో ఇళ్లనుంచి బయటకు వచ్చేశారు.
ఈ బస్టాండ్‌కు వచ్చే రెండు వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్‌ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఎంజీబీఎస్‌లోకి వరద నీరు చేరుకున్నట్టు ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం దృష్ట్యా బస్సులను ఎంజీబీఎస్ లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తాత్కాలికంగా మళ్లించామని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ వరకు, కర్నూల్, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ వద్ద మళ్లిస్తున్నారు. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తున్నారు.
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జేబీఎస్ వరకు అనుమతిస్తున్నారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లను మార్చామని సుఖేందర్ రెడ్డి తెలిపారు. రేపు మరో వంద మంది ఎంజీబీఎస్ సిబ్బంది అదనంగా విధుల్లో ఉంటారని చెప్పారు. మరోవైపు చాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహించడంతో ఆ వంతెనను మూసేశారు. చిన్న వంతెన మూసివేయడంతో పెద్ద వంతెనపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది.
మరోవైపు మూసారాంబాగ్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అంబర్పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు మూసేశారు. మూసారాంబాగ్ పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వరద నీటిలో కొంత వంతెన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది.
మూసీ వెంట ఉన్న బస్తీలు చాలా వరకు నీట మునిగాయి. రాత్రి వేళ నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది. చాదర్‌ఘాట్ రసూల్‌పురాలోని ఓ ఇంట్లో ఎనిమిది మంది వరద నీటిలో చిక్కుకున్నారు. హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం బోటులో వెళ్లి వారిని రక్షించే ప్రయత్నం చేసింది.
నది వెంట ఉన్న శంకర్‌నగర్, మూసానగర్, దుర్గానగర్, అంబేడ్కర్ నగర్, కృష్ణానగర్, భూలక్ష్మి దేవాలయం, బండ్లగూడ జాగీర్‌లోని సాయిరాంనగర్, పీఅండ్‌టీ కాలనీలో వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత పారంతాలకు తరలించారు. నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలతో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు రంగంలోకి దిగారు.
ఆయా ప్రాంతాల్లోని ముంపు బాధితులను సుమారు 1,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి భోజనం, తాగునీరు ఏర్పాట్లు చేయడంతోపాటు దుప్పట్లు అందజేశారు. వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన కర్ణన్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌లోనూ నీటి మట్టం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం దాటింది. దీంతో సర్‌ప్లస్ నాలా తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
More Stories
ముస్లిం మతగురువు తౌకీర్ రాజా అరెస్టు
‘ఐ లవ్ మహమ్మద్’ వివాదంతో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు
పాకిస్థాన్ ప్రధాని డ్రామాలను ఐరాస మరోసారి చూసింది