ముస్లిం మ‌త‌గురువు తౌకీర్ రాజా అరెస్టు

ముస్లిం మ‌త‌గురువు తౌకీర్ రాజా అరెస్టు
* ఐదు రోజుల ముందే అల్లర్లకు కుట్ర.. తరాలు గుతుంచుకొనే విధంగా గుణపాఠం- యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీలో ఐ ల‌వ్ మ‌హ‌మ్మ‌ద్ ఆందోళ‌న‌కు పిలుపునిచ్చిన స్థానిక ముస్లిం పూజారి, ఇత్తెహ‌ద్ ఇ మిల్ల‌త్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రాజాను అరెస్టు చేశారు. శ‌నివారం ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఐ ల‌వ్ మ‌హ‌మ్మ‌ద్ క్యాంపేన్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవాళ్లు భారీ సంఖ్య‌లో హాజ‌రుకావాల‌ని తౌకీర్ రాజా పిలుపునిచ్చారు.  దీంతో శుక్ర‌వారం ప్రార్థ‌నల త‌ర్వాత భారీగా ఆయ‌న ఇంటి ముందు జ‌నం గుమ్మిగూడారు. ప్ర‌స్తుతం పోలీసులు ఆయ‌న్ను విచారిస్తున్నారు.

బరేలీలో పోలీసులు, స్థానికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సందేశం పంపిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 

శుక్ర‌వారం రాళ్లు రువ్విన స్థానికుల‌పై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. రాజా ఇంటి ముందు ప్ల‌కార్డుల‌తో జ‌నం భారీగా గుమ్మికూడి నినాదాలు చేశారు.  దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. బ‌రేలీ ఘ‌ట‌న‌తో లింకున్న 30 మందిని అరెస్టు చేశారు. 50 మందిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. గుర్తు తెలియ‌ని 1700 మందిపై కేసు ఫైల్ చేశారు. ఐ ల‌వ్ మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌చారం దేశ‌వ్యాప్తంగా వ్యాపించింది.

గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్ జిల్లాలో ముస్లింలు కొన్ని షాపులు, వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు.  క‌ర్నాట‌క‌లోని దేవ‌న‌గిరిలో కూడా ఐ ల‌వ్ మ‌హ‌మ్మ‌ద్ పోస్టర్లు వెలిశాయి. దీంతో అక్క‌డ రెండు గ్రూపుల మ‌ధ్య రాళ్లు రువ్వే సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. యూపీలోని ఉన్నావో, మ‌హారాజ్‌ఘంజ్‌, ల‌క్నో, కౌషాంబిలో కూడా అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. బరేలీలో ఐదు రోజుల వ్యవధిలో జరిగిన హింసాకాండను ముందస్తుగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

కుట్రలో పాల్గొన్న వారందరినీ పోలీసులు ప్రస్తుతం గుర్తిస్తున్నారు. అల్లర్లు చేసినవారు, అశాంతిలో పాల్గొన్న నిర్వాహకులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. కీలక నిర్వాహకులపై అధికారికంగా  ఎన్ఎస్ఏని ప్రయోగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదనంగా, అనుమానితులైన వారందరి కాల్ వివరాల రికార్డులు (సిడిఆర్ లు) విశ్లేషించబడుతున్నాయి మరియు ఘర్షణలు జరిగిన ప్రాంతాల నుండి సిసిటివి ఫుటేజ్ ద్వారా అల్లర్లను గుర్తిస్తున్నారు.

“పండుగల సమయంలో ఇదివరలో అల్లర్లు ఎల్లప్పుడూ ప్రారంభమయ్యేవని మీరు చూసి ఉండాలి. ఇప్పుడు, అల్లర్లకు పాల్పడేవారికి తదుపరి ఏడు తరాలు గుర్తుంచుకునే గుణపాఠం నేర్పుతున్నాము. కొన్నిసార్లు, ప్రజలు వారి చెడు అలవాట్లను వదిలించుకోనప్పుడు, వాటిని సరిదిద్దడానికి మనం వారికి కొంచెం ‘డెంటింగ్ , పెయింట్’ ఇవ్వాలి. నిన్న బరేలీలో మీరు ఈ ‘డెంటింగ్,పెయింట్’ చూశారు” అంటూ ఓ కార్యక్రమంలో పాల్గొంటూ యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 
 
“ఆ మౌలానా అధికారంలో ఉన్నవారిని మర్చిపోయాడు. అతను మమ్మల్ని బెదిరించి నగరాన్ని స్తంభింపజేయగలడని అనుకున్నాడు. కానీ మేము స్పష్టం చేసాము. దిగ్బంధనం ఉండదు, కర్ఫ్యూ ఉండదు. అయినప్పటికీ, వారి భవిష్యత్ తరాలు అల్లర్లు అంటే ఏమిటో మరచిపోయేంత గుణపాఠం నేర్పుతాము” అంటూ యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.