
బాణాసంచాపై పూర్తి నిషేధం విధించడం వలన ఆ పరిశ్రమ మాఫియా చేతుల్లోకి వెళుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. బాణాసంచాను మోసపూరితంగా ప్రజలకు విక్రయించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. బాణాసంచాపై పూర్తి నిషేధం పనిచేయదని, సమతౌల్య విధానం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవారు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
బీహార్‌లో మైనింగ్‌పై పూర్తి నిషేధం మాఫియా ప్రవేశించడానికి దారితీసిన పరిస్థితులను సిజెఐ జస్టిస్ బి.ఆర్.గవారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బాణాసంచా పరిశ్రమపై ఉక్కుపాదం మోపడానికి, నిరంకుశ విధానాన్ని అమలు చేయడానికి యత్నించడం వ్యర్థమని పేర్కొన్నారు. బాణాసంచా పరిశ్రమలో జీవనోపాధి సంపాదించే హక్కు, వాయు కాలుష్యం కారణంగా ఇబ్బంది పడకుండా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందే హక్కు ఉండేలా సమతౌల్య విధానం చేపట్టాలని సూచించింది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక పరిష్కారాన్ని చూడాలని పర్యావరణ మంత్రిత్వ శాఖను ధర్మాసనం ఆదేశించింది. బాణాసంచా తయారీ దారులు, విక్రయదారులు సహా అన్ని వాటాదారుల వాదనలను వినాలని కోరింది. ఎన్ఇఇఆర్ఐ, పిఇఎస్ఒ సంస్థలు గ్రీన్‌క్రాకర్స్‌ను ఉత్పత్తి చేసేందుకు కోర్టు అనుమతించింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిషేధిత ప్రాంతాల్లో తమ ఉత్పత్తులను విక్రయించబోమని హామీ ఇవ్వాలని కోర్టు పేర్కొంది.
More Stories
మదర్సా మరుగుదొడ్లలో 40 మంది బాలికల నిర్బంధం
తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలను వెళ్లగొట్టవచ్చు
రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం