షారూక్ ఖాన్‌పై స‌మీర్ వాంఖ‌డే ప‌రువున‌ష్టం కేసు

షారూక్ ఖాన్‌పై స‌మీర్ వాంఖ‌డే ప‌రువున‌ష్టం కేసు

మాజీ నార్కోటిక్స్ ఆఫీస‌ర్ స‌మీర్ వాంఖ‌డే ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ద బాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌తో పాటు నటుడు షారూక్ ఖాన్‌పై ఆయ‌న ప‌రువు న‌ష్టం కేసు వేశారు. ఆర్య‌న్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్‌సిరీస్‌లో నార్కోటిక్స్ ఆఫీస‌ర్ పాత్ర‌ను త‌ప్పుగా చూపించిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. షారూక్‌తో పాటు రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ నుంచి వాంఖ‌డే రెండు కోట్ల న‌ష్ట‌ప‌రిహారాన్ని కోరాడు. 

త‌న‌కు వ‌చ్చే న‌ష్ట‌ప‌రిహారాన్ని టాటా మెమోరియ‌ల్ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ఆ వెబ్ సిరీస్‌లో యాంటీ డ్ర‌గ్ ఎన్‌పోర్స్‌మెంట్ ఏజెన్సీల‌ను నెగ‌టివ్ పాత్ర‌లో చూపించిన‌ట్లు ఆరోపించారు. ప్ర‌జా వ్య‌వ‌స్థ‌ల‌పై విశ్వాసం కోల్పోయే రీతిలో ఆ సిరీస్ ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ద బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌లో ఓ క్యారెక్ట‌ర్‌ను స‌మీర్ వాంఖ‌డే ప్రేర‌ణ‌తో తీశారు. 

బాలీవుడ్ పార్టీ జ‌రుగుతున్న ప్ర‌దేశానికి వ‌చ్చిన ఆ ఆఫీస‌ర్ ఎవ‌రు డ్ర‌గ్స్ తీసుకుంటున్నారో ఆరా తీస్తాడు. సెప్టెంబ‌ర్ 18వ తేదీ నుంచి ఆ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స‌మీర్ వాంఖ‌డే గౌర‌వానికి భంగం క‌లిగించే రీతిలో కావాల‌నే పాత్ర‌ను సృష్టించార‌ని వాంఖ‌డే త‌న స్టేట్మెంట్‌లో తెలిపారు. స‌మీర్ వాంఖ‌డే, ఆర్య‌న్ ఖాన్‌కు చెందిన కేసు ప్ర‌స్తుతం ముంబై హైకోర్టులో ఉంద‌ని వాంఖ‌డే వాంగ్మూలం ద్వారా తెలిసింది.

2021, అక్టోబ‌ర్ 3వ తేదీన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్య‌న్ ఖాన్, అయాజ్ మ‌ర్చెంట్‌, మున్మున్ ద‌మేచాను అరెస్టు చేసింది. నిషేధిత డ్ర‌గ్స్‌ను క‌లిగి ఉన్న‌ట్లు, అమ్ముతున్న‌ట్లు కేసు బుక్ చేశారు. ఓ క్రూయిజ్ షిప్‌ను రెయిడ్ చేసిన త‌ర్వాత ఆ షిప్‌లో డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 20 మందిని అరెస్టు చేశారు. ఆ కేసు ద‌ర్యాప్తును స‌మీర్ వాంఖ‌డే చూశాడు. ఆర్య‌న్ ఖాన్25 రోజుల పాటు జైలుశిక్ష అనుభ‌వించాడు. ఆ త‌ర్వాత బెయిల్ దొరికింది. 2022, మే నెల‌లో ఆర్య‌న్ ఖాన్‌పై ఉన్న కేసుల్ని కొట్టిపారేశారు. నార్కోటిక్స్ ఆఫీస‌ర్ వాంఖ‌డేను బ్లాక్‌మెయిల్ ఆరోప‌ణ‌ల కింద విధుల నుంచి తొల‌గించారు.